వాడికో ముద్ద.. దీనికో ముద్ద.. అన్నకో ముద్ద.. అక్కకో ముద్ద.... అంటూ చిన్నారిని మాయ చేసి బలమిస్తారు కదా! ఇరుగూ పొరుగూ కలిసి ఓ వంటకం వనభోజనానికి పెంచుతారు కదా! పిల్లల భవిత, తర్వాతి తరం పచ్చగా కళకళలాడాలని బలమైన కోరిక ఉందంటారు వీటిలో. కానీ, మనమిప్పుడు ఎక్కడ చేయి కడుక్కుంటున్నాం..? పార్కుల్లోనో, కృత్రిమ నెలవుల్లోనో ప్లాస్టిక్‌తో నిండిన విస్తరి వడ్డించుకుంటున్నామనే బెంగ ఈసారి మరీ ఎక్కువ కల్గుతోందా? మరో వనభోజనం మళ్లీ సహజంగా సిద్ధమవ్వాలంటే చెట్టుకూ బలమిచ్చేలా ఓ ముద్ద పెట్టాలి.
తిమ్మమ్మ మర్రిమాను చచ్చిపోతోంది..! వార్త మనసు చంపేసి ఉంటుంది చాలామందికి. స్కూలు పుస్తకాల్లో ఓ పాఠంగా చదువుకున్న తరానికి అదో అద్భుతం. జీవితంలో ఒక్కసారైనా చూసి రావాలన్నా పచ్చని నేస్తం. కుదిరితే, ఆ మాను తొర్రలో ఓ కునుకుతీయాలనే చిన్ననాటి కల. ఊడల్లో జోలలు పాడించుకోవాలని, ఊయలలూగాలని... ఎన్ని పక్షులున్నాయో లెక్కేయాలని.. మరెన్ని కొమ్మలున్నాయో తేల్చుకురావాలని... ఒకటే ఆలోచనలు. అసలు పాఠం పక్కనపెట్టి ముద్ద తినే వేళా దాని గోలే. నోట్లో కరివేపాకు రుచి తగిలి ముద్ద తింటూనే తిమ్మమ్మ కథ కొనసాగింపు. అనంతపురం జీవకళ, ప్రకృతి వరం అంటూ మాస్టారు కళ్లెగరేస్తూ చెప్పినదానికి ఇంట్లో మరింత చర్చ. ఇప్పుడు ఆ తరమే పెద్దదైంది. బడి పుస్తకాల్లోని చాలా పాఠాల్లానే తిమ్మమ్మ మర్రిమానూ మరపున మరుగున పడిపోయింది. ఇప్పుడా కలలకూ అంత విలువ లేదు. తీరికా లేదు. అవకాశం లేదు..! నాలుగున్నర ఎకరాల్లో విస్తరించి గిన్నిస్‌లోనూ రికార్డయిన ఆ మహావృక్షం, 'ట్రీ స్పిరిట్స్' బీబీసీ సిరీస్‌లోనూ తన కథ చెప్పించుకున్న ఆ వృక్షరాజం ముప్పులో పడింది. ఈ మధ్యే దానిలో ఓ భాగం విరిగిపడింది. ఇది దాని మరణావస్తకు లక్షణమని అంటున్నారు. ఇప్పుడు కాపాడుకోకుంటే ఇక మిగలదట..! 600 ఏళ్ల చెట్టది..! జాగ్రత్తగా కాపాడుకుంటే వేల ఏళ్ల బతుకు దానికుంది. చల్లటి నీడలో వనభోజనాలు జరుగుతుంటాయి. చక్కటి వాతావరణంలో సరాదాలు సాగుతుంటాయి. ఆ మట్టి పులిమే పరిమళం మరింత రుచిగా, కేరింతగా గుర్తుల్ని మిగులుస్తాయి. మరి, ఆ చెట్టుని కాపాడుకోవాలని కనీసం ఈ వేళన్నా గుర్తుకు రావాలి కదా! అదనే కాదు, తమ చుట్టూ పెరిగిన ఊరి అవసరాలకు మోడైపోయే పెద్ద చెట్లెన్నో..! తను పలకరించాలని వెళ్లిన సొంతూరి ఆత్మీయుల్లో ఊరిమధ్య పచ్చగా విస్తరించిన చెట్టు ఒకటని ఓ కథకుడు రాసుకుంటాడు. దాని చుట్టూనే ఒదిగిన బాల్యం, ఎదిగిన జీవితం అతడిది మరి. దాని జాడే లేకుండా ఇప్పుడక్కడ రోడ్డు పర్చుకుని కనిపించే దృశ్యం ఎంత పెద్ద హత్య చేస్తుందతడి జ్ఞాపకాల్ని..! తాతలకు ముందు నుంచీ ఉన్న ఆ వృక్షరాజం చుట్టూనే గోరు ముద్దలు, దొంగాటలు, అడాల్సెంట్ ప్రేమలు, అమాయకపు దెయ్యం కథలు... ఎన్నని దోబూచులాడాయి. వనభోజనం మాటేమో గానీ, కూలి మనసులు కాలే కడుపులో కలి ముద్దేసుకుని, కొత్త పాణానికి సేద తీరేది అలాంటి చెట్ల నీడలోనే కదా! మూసిన రెప్పలతో విప్పారిన పాటలతో ఆ చెట్టు ఎన్ని చక్కటి, కమ్మని విందుల్ని చిగుర్చిందో! మొన్నీమధ్య సోషల్ మీడియాలో ఓ వీడియో వైరలయ్యింది. అందులో ఓ పెద్ద చెట్టుని కూల్చేసిన దృశ్యముంది. అరెరే... అని టచ్స్క్రీన్లని బాదినవారెందరో! ఇంకా పెద్ద చెట్టుతో బంధం పచ్చిగా పచ్చగా మిగిలే ఉంది మనకు. అందుకే, వెదుక్కుని మరీ ఓ చెట్టు దగ్గర చాపనో, పట్టానో వేసి వనభోజనాలకు గొప్ప స్పాట్‌ని సొంతం చేసుకుంటాం. ఓ చెట్టు చుట్టుతా మూడు బృందాలన్నా సర్దుకుపోతాం. అస్సలు కలవని మనిషి పక్కనా స్మైలిచ్చి కూర్చుంటాం. ఇక పదుల, వందల చెట్ల తావి దొరికితే! ఇక ఈ నెలంతా అదో కాస్ట్లీ 'రియల్' ఎస్టేట్! అనుభూతులు వెరీ కాస్ట్లీ అయిపోయాయి మరి. వనభోజనాలు తోటల్లోకి సర్దుకున్నాక పట్టాకో అద్దె, కుర్చీకో రుసుం. అయినా, పర్లేదు తోటలోకెళ్లా పచ్చటి, పెద్దటి చెట్టు దగ్గర పాగా వేసి గొప్పతనం, దర్పం ప్రదర్శించాల్సిందే..! ఇక్కడ వరకే ఇప్పటి వరకే చెట్టు విలువ, కోల్పోతున్న అనుభూతుల విలువ అర్థమవుతుంది. పట్టా లేపేసి ఎటోళ్లు అటు పోయాక, ఇక పట్టింపు ఉండదు. కళ్లముందే రియల్ ఎస్టేట్ ఆ తోటనీ ప్లాట్ల పార్కు చేసేస్తుంటే ఉస్సూరని ఉండిపోతామంతే. అంతేగానీ, సామాజిక వనాల్ని పెంచుకునే ఆలోచనే చేయరు. చేసినా, ఆ ప్రయత్నంలో మట్టిని అంటించుకోలేని బద్దకం ఎక్కువ. వనభోజనాల టైముకి గుర్తొచ్చి మరిచిపోయే పచ్చటి లోటుని భర్తీ చేసే ఉద్దేశం ఉపన్యాసాల్లోనూ బహుశా అంతగా వినిపించదు.
దూరం పెరిగింది.. ఆలోచన తగ్గింది
పదేళ్ల క్రితం వనభోజనాల కోసం చోటుని వెదుక్కోవడానికి అంత కష్టం కలిగేది కాదు. చుట్టూ ఎటు వెళ్లినా పరమాన్నంగానే ఉండేది. ఏడాదికో దిక్కున, ప్రకృతి విశేషం దగ్గర పూర్ణాల్ని పరిపూర్ణంగా లొట్టలేసుకునేవాళ్లం. కొండలు, చెరువులు, నదులతో కళకళలాడే తెలుగు రాష్ట్రాల్లో చేసేవే అసలైన వనభోజనాలని... వేరేవారి పిక్నిక్కులు అసలు లెక్కలోకే రాలేవని ఎంత అభిమానం ఉండేది మనకు. కానీ, ఇప్పుడు అలా కాదు. నగరాలైతే పది కిలోమీటర్ల దూరం వరకూ చోటు దొరకదు. దొరికినా, కిక్కిరిసిపోయి ఉక్కిరిబిక్కిరైపోయే పరిస్థితి. మరో బృందానికి చోటివ్వాలంటూ ఒకటే హడావిడి తిండీతిప్పలు. ఇక పల్లెవాసుల వనభోజనాలకూ రుచి తగ్గిపోయింది. పొలాల ల్యాండ్‌స్కేప్‌లు లేకుంటే, ప్లాట్లు మధ్యమధ్యలో అపార్ట్మెంట్లు. తమ తోటల్లో సిటీజనుల చొరబాట్లు..! చిన్నచిన్న ఘర్షణలు. నగరజీవులు అదే పనిగా తొక్కేసి వెళ్లాక సరిచేసుకోవాల్సిన తోటల బాగోగులు. ఇప్పుడు, మామిడి, సపోటా లాంటి చెట్ల తోటలే వండరైపోయాయి. మామిడి చెట్టు ఇంతుంటుందా! దాని ఆకులు ఇన్ని రంగులు మారుతాయా? కొమ్మలు ఇంత కిందకు వంగి పెరుగుతాయా..? చెట్టెలా ఎక్కాలి? దానికి ఫీజు కట్టాలా? అయ్యో కొమ్మ విరగ్గొట్టేశామే..? ఉన్నఫళంగా ఖాళీ చేయాలా ఏంటి? ఎంత కష్టమొచ్చింది! దట్టమైన కీకారణ్యాల్లో వంటకాలు పంచుకోమని కాదు, వనభోజనమంటే కనీసం ఓ ఐదారు రకాల చెట్లు కలిసి పెరిగే చోటన్నా జరగాలి కదా! ఎక్కడైనా అవి మిగిలుంటే.. వాటన్నింటికీ కలిపి ఒకటే నామధేయం 'పిచ్చి' చెట్లని..! ఆకు బొమ్మని పది రకాలుగా వేయొచ్చని పిల్లలకు తెలిసే పాఠం బాగా మిస్సయిపోతోంది. పెద్దలేదైనా చెట్టు పేరు చెప్పగలిగితే అదే ఓ పెద్ద పాఠమైపోతోంది. ఆకుని బట్టి, కాయని బట్టి చెట్టు పేరు దాని మీద బతికే జీవాల తీరు చెప్పగలిగే మనిషి మిగులున్నా వనభోజనాల వేదికల మీద 'స్పేస్' కల్పించబడదు. అసలు ఆ ఆలోచనే రాదు. ఇక అడవి కథలు అందంగా, అద్భుతంగా జ్ఞాపక సమాధుల్లోకి పూడ్చపెట్టబడిపోతాయి. ఉసిరి, వేప, సీతాఫలం మొక్కలు నాలుగు నాటి వన సంరక్షణకు చేతులు దులుపుకునేవారికి వృక్షవైవిధ్యం విలువ, అవసరం అంతగా తెలీవు. ఒకదానితో ఒకటి ముడిపడిన జీవచక్రం సూత్రం అస్సలు అర్థంకాదు. అందుకే, 'పిచ్చి' చెట్లని నరుకుతున్నా పట్టదు. ఇలా, ఓ వనభోజనాల వేళ ఒకప్పుడు ఊరి మొదట్లో తగిలే ఆ ఎర్రపూల వర్షం, మత్తు పూల గాలి ఏ చెట్టుదో అని లోలోపలే శాడ్ ఫీలవుతాం.
రాలిపోతోన్న అరుదైన సంపద
'డ్యూడ్! ఈ పిక్ చూశావా? ఎంత డిఫ్ఫరెంట్గా ఉందో ఈ ట్రీ' అంటూ పక్కనోడికి చూపించడమే కాక, మిగతా ఫేసుబుక్కు, వాట్సప్ డ్యూడ్లందరికీ, ఇంకా కుదిరితే ఇన్‌స్టా బ్రోలందరికీ షేర్ కొట్టేస్తారు. ఆఫ్రికాలోని బావోబావో చెట్టు వర్చువల్‌గా కనిపిస్తే ఇలాంటి ఈ-కాలం ప్రకృతి ప్రేమికులకు గుండె గిలాగిలాకొట్టేసుకుంటుంది. ఎప్పటికైనా మడగాస్కర్ యాత్ర చేసి వింత రూపంలోని బావోబావో చెట్టు ముందు సెల్ఫీ తీసేసుకోవాలనిపిస్తుంది. కిందటి తరం తిమ్మమ్మ మర్రిమాను, ఇప్పటి బావోబావో కథ ఒకే ముగింపు కాకూడదని తర్వాత కోరుకుందాం గానీ, గోల్కొండలో ఈ చెట్టుందని ఎంతమందికి తెలుసు..! 430 ఏళ్ల ఈ చెట్టుముత్తాతని క్లైమేట్ చేంజ్ ఊపిరి తీసేస్తోందని ఇంకెంత మందికి ఎరుక. ఏనిగ చెట్టు అని పిలుచుకునే దీనికి ఇమ్మీడియెట్ హెల్త్ చెకప్ అవసరమట..! ఆఫ్రికాలోని బావోబావో చెట్లనే ఒకప్పుడు ఇక్కడ తెచ్చివేశారు. అవి ఎలాగొలా బతికేశాయి ఇన్నాళ్లు. ఈ మధ్యే రోడ్డు పనుల కోసం వాటి విలువ తెలిసో తెలియకో కొట్టిపడేశారు. ఓ డజను చెట్లు అత్తాపూర్, సికింద్రాబాద్ క్లబ్, రంగనాథ గుడి, వనస్థలి పురం, చెంగిచెర్ల రిజర్వు ఫారెస్టులో అక్కడక్కడ ఉన్నాయట. లోపలినుంచి చచ్చిపోయే ఈ చెట్లను కాపాడాలంటే వృక్షశాస్త్రవేత్తలు, వైద్యులు రావాలి. ప్రభుత్వాలు చొరవ చూపాలి. ఇవేకాదు, ఇంకా ఎన్నో అరుదైన చెట్లు నేలకూలిపోతున్నాయి. ఊరికే పెద్దగా కనిపించే వందల ఏళ్ల చెట్లను అవసరాల పేరిట తేలిగ్గా కొట్టిపడేస్తున్నారు. పేరు తెలీదని, ఉపయోగం లేదని అరుదైన జాతి వృక్షాల్ని పీకిపారేస్తున్నారు. వెదురు బయలు, తుమ్మ బయలు గ్రాఫిక్సులో పీరియాడికల్ సినిమాలకు వాడే పరిస్థితి. నేరేడు కాయల్ని విజయవాడ వచ్చి కొని చూస్తే తెలుస్తుంది.. యాపిల్ కన్నా విలువ, అరుదు అయిపోవడంతో పాటు కనుమరుగైపోతున్నాయని. నేరేడు చెట్టు ఎంత ఎత్తున పెరుగుతుంది! దానికి అనుబంధంగా ఇంకెన్ని చెట్ల రకాలు పెరిగేవి. ఎన్ని పక్షులు, ఉడతలు కలియతిరుగుతూ సందోహంగా ఉండేది. అలాంటి చెట్ల తావులో వనభోజనం ఎంత తృప్తిగా జరుగుతుంది. ఇవి ఒకప్పుడేమీ వాణిజ్య చెట్లు కావు. ఊళ్లో ఎవరైనా నాలుగు కాయలు కొట్టుకుని తినగలిగే అందరివాళ్లు. దూది కాయలు, గమ్ము కాయలు, టపాసుల గింజల చెట్లు. ఆడుకోడానికి, పిల్చుకోడానికి, వాడుకోడానికి ఎన్ని రకాల చెట్లు. దెయ్యం చెట్టని చిన్నప్పుడు జడుసుకున్నా అది చాలా అరుదైన జాతిదని పెద్దప్పుడు తెలుసుకున్నా... జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ వరకే వాటిని వదిలేసుకుంటే ఎలా? వాటిని కాపాడుకునేందుకు గొడ్డలి వేటు అడ్డుకునేందుకు బాగా తెలిసిన మనిషి ప్రయత్నం చేయాలి కదా! వనభోజనాలప్పుడు చోటు శుభ్రం చేసి విందుచేసుకునే మనమే ఆ తర్వాత ఆ చెట్లు మిగిలిఉండే ప్రయత్నాలెందుకు మొదలెట్టకూడదూ..! మనం నాటిన చెట్లు మరో పదేళ్లకో ఇరవై ఏళ్లకో మరొకరి వనభోజనాలకు ఉపయోగపడతాయి. మనం ఇప్పుడు మిగుల్చుకున్న చెట్లు ఇంకెంత...? ఆలోచిస్తే మంచిది. అరుదైన చెట్లంటే అడవుల్లో ఎక్కడో మనం వెళ్లవీలులేని చోటవే కాదు. మన ఊరి చివరన, మన కొండ కిందన, మన చెరువు పక్కన తెలియని మనిషిలా గుండె పగిలి నేలకూలుతున్నాయి. పట్టించుకునే దిక్కులేక తల్లడిల్లుతున్నాయి. వాటి చివరిచూపు ఇంకో వనభోజనానికే! చూసుకోండి మరి.
ఏడాదికేంది, వీలు కుదిరినప్పుడల్లా కొండెక్కి చేసుకునే వనభోజనాలెన్ని..! గుంటూరులోని తాడికొండకు నిట్టనిలువున ఓ మెట్ల దారి ఉంటుంది. సరిగా లేని ఘాట్‌రోడ్డు మీద పైకెక్కి చుట్టూ చూడొచ్చు. అక్కడి నుంచి అంతెత్తు నుంచి కనుపాపల నిండా కనిపించే చెరువు చూసి కళ్లనిండా నీళ్లు నింపుకోవచ్చు. మేఘాలు ఈ కొండగాడి అనేకమంది మిత్రుల్ని ఎలా ముద్దాడతాయో! వాటినే నమ్ముకుని పర్చుకున్న మైదానాల్లోని పొలాల్లోకి వర్షామృతాన్ని ఎలా కురిపిస్తాయో చూసి ఆశ్చర్యపోవచ్చు. వేగంగా వీచేగాలికి మనసు గాలిపటాన్ని ఎగరేసుకోవచ్చు. ఇంకా, కొత్తకొత్తగా చెట్ల స్నేహగాళ్లను చూసి రావొచ్చు. అలాంటి చోటకు తరచూ ఓ ఇద్దరు బడి పిల్లలు ఉడతల్లా ఉత్సాహంగా వచ్చి తిరగుతుంటారు. వాళ్లని కదిపితే, ఏదో సరదాకి వచ్చి అన్నం తినెళతాం. ఇక్కడకు రాకపోతే ఏదో మిస్సయిపోతామని సమాధానం. మరి, ఏడాదికోసారి మాత్రమే చేసే వనభోజనాలప్పుడు మనమేం మిస్సయిపోతున్నామో వెల్లుల్లిలాగైనా కరివేపాకులాగైనా తగులుతోందా!
చిరు చిగుళ్లు
ఆరే వనంలో చెట్ల నరికివేత కేసుని అప్పుడే మర్చిపోలేదు కదా! అభివృద్ధి పేరిట వేలాది చెట్లను నరికేసేందుకు బీఎంసీ ప్రయత్నిస్తే ఎంత ఉద్యమం సాగిందో. వేలాదిమంది యువత, చిన్నారులు పరుగుపరుగున ఆరే వనం చేరుకుని చెట్లను కావలించుకున్నారు. ప్రాణాలకు తెగించి పొక్లెయిన్లు, పోలీసు వాహనాలకు అడ్డుపడ్డారు. ఖండఖండాలైన చెట్ల మీద పడి గుండెలు బాదుకున్నారు. అర్ధరాత్రులు ఇళ్లకు చేరకుండా మరొక్క వేటు పడకుండా కాపుకాశారు. రోడ్డున పడ్డారు, కోర్టులో పోరాడారు. చివరకు ఆన్లైన్ 'చేంజ్.ఆర్గ్' వేదికపైనా పనిచేశారు. ఇప్పటికే, ఆరు లక్షల మంది పిటిషన్ మీద సంతకం చేశారు. దేశంలో ఇదో మట్టితల్లి, చెట్టుతల్లి దుమారం! పచ్చటి ప్రకృతి బిడ్డలుగా మారిన ఈ తరం వైనం..! మరెందరికో స్ఫూర్తి నింపింది. ఆలోచన కలిగించింది. మెట్రో ట్రైన్ సర్వీస్ ఏరియా పేరిట ఓ కారు షెడ్డు కోసం మా ఊపిరి తీసేస్తారా? అన్న ఆక్రోశం పెద్ద పెద్ద తలకాయల్నే ఆలోచనలో పడేసింది. దేశముదుర్లు, డేంజర్లు అనుకునే నేతల్ని భయపెట్టింది. ఇలాంటి ఉద్యమాలు మరిన్ని బయలుదేరాల్సిందే! రాష్ట్రంలో మరోచోట చెట్టుని నరకడం అంత సమస్య కాదనే పరిస్థితిలో కృష్ణాజిల్లా పల్లె ఒకటి ఆశల్ని పెంచింది. గూడూరు మండలంలోని పోసినివారిపాలెంలో కాల్వ పక్కనున్న పాతికేళ్ల నిద్ర గన్నేరు చెట్టుని కొట్టారని ఒకరికి పంచాయతీ జరిమానా విధించింది. పశువుల పెంపకందార్లకు, కలంకారీ పనివారికి, వ్యవసాయ కూలీలు సేదతీరే ఆ చెట్టు విలువ వారికి బాగా తెలుసు. చుట్టూ ఉన్న ఊళ్ల నుంచి 35 మంది పెద్దలు, జనం వచ్చి ఈ తీర్పునిచ్చారు! విద్యుత్ తీగెలకు అడ్డొచ్చే కొమ్మల వరకూ నరికేదానికి చెట్టంతా కొట్టేస్తే ఎలా మరి? తిమ్మమ్మ గురించి చెప్పుకున్నాం కదా! పిల్లలమర్రి సంగతి మర్చిపోకూడదు కదా! ప్రపంచంలోనే రెండో అతి పెద్ద చెట్టుగా రికార్డున్న ఇది మహబూబ్‌నగర్‌లో ఉంది. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో పరుచుకున్న ఈ మహావృక్షానికి 800 ఏళ్లు! ఈ మధ్యే సెలైన్లు పెట్టి మరీ బతికించుకునే ప్రయత్నం చేశారు. చెట్టుకి సెలైన్లేంటని ఆశ్చర్యపోయారు చాలామంది. ఇలాంటి కొన్ని చిరు చిగుళ్లు ఇంకా ఎన్నో తొడగాలి, దేశమంతా అల్లుకుపోవాలి... మనం మనసారా వనభోజనాలకు వెళ్లి విస్తరిపరుచుకునేందుకు కదా.
- అజయ్ కుమార్ వారాల
95023 95077