* ఎన్డీయే నుండి తొలగించడంపై శివసేన
న్యూఢిల్లీ : బిజెపి తొందరపాటు ఖచ్చితంగా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని శివసేన అధికారిక పత్రిక సామ్నా తన సంపాదకీయంలో పేర్కొంది. తమని సంప్రదించకుండానే పార్లమెంట్లో విపక్షం వైపు తమ స్థానాలు మార్చడం, ఎన్డీయే నుండి విడి పోయిందని బిజెపి ప్రకటించిన నేపథ్యంలో శివసేన బిజెపిపై మాటల దాడికి దిగింది. శివసేనకు ఉన్న ఒకే ఒక్క మంత్రి అరవింద్ సావంత్ తన పదవికి రాజీనామా చేసిన అనంతరం పార్లమెంట్లోని ఉభయ సభలలోనూ ఆ పార్టీ ఎంపీలకు ప్రతిపక్ష బెంచిలలో సీట్లు కేటాయించడాన్ని సామ్నా సంపాదకీయంలో విమర్శించింది. శివసేనకు కేటాయిస్తున్న స్థానాలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద జోషి ఆదివారమే తెలిపారు. ''బిజెపికి ఏ పార్టీ మద్దతివ్వలేదని, ఇప్పటి ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్న పలువురు బిజెపి నేతలకు ఎన్డీయే ఏర్పడిన తొలినాళ్ళలో ఎటువంటి పదవులు లేవు. అప్పటికి కొంతమంది పుట్టికూడా ఉండలేదు. మేము ఎన్డీయేలో భాగస్వామి అయినప్పుడు బిజెపితో కలిసేందుకు ఏ పార్టీ ఇష్టపడలేదు. బిజెపిని, దాని జాతీయవాద హిందుత్వ విధానాలను చాలామంది ఇష్టపడలేదు'' అని సామ్నా సంపాదకీయం పేర్కొంది. తమని ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం బిజెపి అహంకార పూరిత రాజకీయాలకు నిదర్శనమని వ్యాఖ్యానించింది. ఏదో ఒక రోజు బిజెపిని కూకటివేళ్ళతో పెకిలిస్తామని పేర్కొంది. జమ్ము కాశ్మీర్లో బిజెపి పీపుల్స్ డెమక్రటిక్పార్టీ (పిడిపి)తో పొత్తు పెట్టుకున్న సమయంలో అది ఎవరి అనుమతి తీసుకోలేదని, అదేవిధంగా నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడియు ఎన్డీయేలో భాగస్వామి అయినప్పుడు కూడా తమని ఎవరూ అడగలేదని శివసేన గుర్తు చేసింది.
బిజెపి తొందరపాటుతో తీవ్ర పరిణామాలు
