ప్రజాశక్తి - కడప సిటీ ప్రతినిధి
ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు.. శనివారం స్థానిక సిపిఎం జిల్లా నూతన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉక్కు పరిశ్రమ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీని అమలు చేయాలన్నారు. కడప జిల్లాలో ప్రభుత్వ రంగ సంస్థ సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయడంతో అనుబంధ పరిశ్రమలు ఏర్పడతాయని తెలిపారు. తద్వారా లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. కరువు నేపథ్యంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర అత్యంత వెనుకబాటుకు గురయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వంటి వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా కేవలం రూ.1050 కోట్లు మాత్రమే చెల్లించి చేతులు దులిపేసుకుందని పేర్కొన్నారు. సమస్యపై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలన్నారు. కరువు నేపథ్యంలో రైతుల పట్ల ఏవిధమైన వైఖరిని అవలంభించనుందో ప్రభుత్వం తెలపాలని కోరారు. ఇసుక సరఫరా ఆగిపోయిన కారణంగా లక్షలాది మంది కార్మికులు, బిల్డింగ్ వర్కర్లు, కాంట్రాక్టర్లు, యాజమాన్యాలు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కార్మికులు ఉపాధిని కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఆలస్యానికి గల కారణాలేమిటన్నది ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. బ్లాక్లో ఇసుకను అమ్ముకుంటున్నారని దీన్ని అరికాట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు. అంగన్వాడీలు, ఆశాలు, మున్సిపల్ వర్కర్లతో పాటు ఇతర ఉద్యోగుల వేతనాలను పెంచుతూ పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలిస్తామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే వివిధ ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ శాఖల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, గౌరవ వేతన ఉద్యోగులుగా పని చేస్తున్న 1.20 లక్షల మందిని పక్కన పెట్టేప్రయత్నం చేస్తున్నట్లు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. జిల్లాలో 24 రోజులుగా గోపాలమిత్రలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం సమస్యలపై చొరవచూపకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం అఖిలపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించాలని అలాకానియడల వామపక్షాలతో చర్చించి తదుపరి కార్యక్రమాన్ని ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఎ.గఫూర్, రాష్ట్ర కమిటీ సభ్యులు బి.నారాయణ, జిల్లా కార్యదర్శి ఆంజనేయులు పాల్గొన్నారు.