మెక్సికో సిటి : మితవాద ప్రతిపక్ష పార్టీల తిరుగుబాటు నేపథ్యంలో బలవంతంగా రాజీనామా చేసిన బొలీవియా అధ్యక్షుడు ఎవో మొరేల్స్కు మెక్సికో రాజకీయ ఆశ్రయం కల్పించింది. మెక్సికో విదేశాంగ శాఖ మంత్రి మార్సెలో ఎబ్రార్డ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బొలీవియా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాజీనామా చేయాలని మొరేల్స్ను సైన్యం కోరడం సరికాదన్నారు. ఏ దేశానికి సంబంధించిన వ్యవహారాలనైనా గౌరవించడంతో పాటు, రాజకీయంగా వేధింపులు, హింసకు గురైన వారికి ఆశ్రయం పొందే హక్కును మెక్సికో కల్పిస్తుందని తెలిపారు. మొరేల్స్ చేసుకున్న అభ్యర్థన, బొలీవియాలో ప్రస్తుతం నెలకొన్న అత్యవసర పరిస్ధితి నేపథ్యంలో మానవతా కారణాల దృష్ట్యా ఆయనకు ఆశ్రయం కల్పించామని మార్సెలో ఎబ్రార్డ్ తెలిపారు. మొరేల్స్కు మద్దతు తెలుపుతూ రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ''బొలీవియాలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు భయపెడుతున్నాయి. ప్రతిపక్షాల హింసాత్మక చర్యలు మొరేల్స్ను పూర్తికాలం అధ్యక్ష పదవిలో కొనసాగనీయకుండా నిరోధించాయి'' అని ఆ ప్రకటన పేర్కొంది. బొలీవియాలో సాధ్యమైనంత త్వరలో రాజకీయ స్ధిరత్వం నెలకొనేలా రెండు పక్షాలు ఒక రాజకీయ పరిష్కారాన్ని కనుగొంటాయని భావిస్తున్నట్లు చైనా తెలిపింది.
మొరెేల్స్కు మెక్సికో రాజకీయ ఆశ్రయం
