* రేపు బొలీవియా సార్వత్రిక ఎన్నికలు
* రంగం సిద్ధం చేసిన అధికార యంత్రాంగం
లాపాజ్: బొలివియా అధ్యక్ష, పార్లమెంట్ ఎన్నికలు ఆదివారం నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. బొలీవియాలో మార్పు కోసం గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ప్రాజెక్టు భవితను తేల్చేందుకు ఆ దేశంలోని 69 లక్షల మంది ఓటర్లు సిద్ధమవుతున్నారు.
గత 14 ఏళ్లుగా బొలీవియాను ఎవో మొరేల్స్ నేతృత్వంలోని మూవ్మెంట్ టువార్డ్ సోషలిజం (మాస్) పరిపాలిస్తున్న విషయం తెలిసిందే. ఉపాధ్యక్షుడిగా అల్వారో గార్షియా లినేరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు మరిన్ని సేవలందించటంతో పాటు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు వీలుగా బొలీవియా మార్పు ప్రాజెక్టును వీరిద్దరూ ప్రారంభించారు. లాటిన్ అమెరికాలోని పరిసర దేశాలన్నీ నియోఫాసిస్టు నేతల సారధ్యంలో నయా సరళీకరణ విధానాల అమలుతో సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న సమయంలో బొలీవియా సుస్థిర పాలనతో నాలుగు శాతం వార్షిక ఆర్థికాభివృద్ధి రేటు సాధించింది. దేశంలో పేదరికాన్ని, నిరుపేదరికాన్ని గణనీయంగా నిర్మూలించటం విశేషం.
అధ్యక్ష అభ్యర్థులెవరు?
ఎవో మొరేల్స్, గార్షియా అల్వారో లినేరా అధికార మాస్ పక్షాన ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఒపీనియన్ పోల్స్ ప్రకారం మొరేల్స్, లినేరా ద్వయానికి దాదాపు 36 నుండి 40 శాతం మేర ఓట్లు లభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వీరికి 50 శాతం అంతకన్నా ఎక్కువ ఓట్లు లభిస్తే తొలి రౌండ్లోనే విజయాన్ని దక్కించుకునే అవకాశాలున్నాయి. లేకపోతే రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థితో పోటీ పడాల్సి వుంటుంది. 2003లో ప్రజాగ్రహాన్ని ఎదుర్కొని రాజీనామా చేసిన మాజీ అధ్యక్షుడు కార్లోస్ మెసాకు ఒపీనియన్ పోల్స్‌లో 22-28 శాతం ఓట్లు వచ్చాయి.
ప్రస్తుత ఎన్నికల పరిస్థితి ఏమిటి?
ఎవో మొరేల్స్ పాలనలో 2006 నుంచి బొలివియాలో కొనసాగుతున్న స్థిరమైన ఆర్థిక ప్రగతి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై పెను ప్రభావాన్నే చూపింది. 2012 నాటికి దేశంలో పేదరికం 32.2 శాతానికి తగ్గింది. ఈ మార్పును ఐరాస సైతం ప్రశంసించటం విశేషం. ఉపాధి కల్పన, వేతనాలు గణనీయంగా పెరగటం, కనీస వేతనాలు 20 శాతం మేర పెరగటం మరో విశేషం. జాతీయకరణ, పారిశ్రామికీకరణ, ప్రభుత్వ సంస్థలకు స్వేచ్ఛ కల్పించటం, ఈ సంస్థలు ఆర్జించిన లాభాలను సామాజిక సంక్షేమ కార్యక్రమాలకు, మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించటమే ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అతి పెద్ద చమురు కంపెనీ యాసిమీంటోస్ పెట్రోలిఫెరోస్ ఫిస్కల్స్ బొలీవియనోస్ (వైపిఎఫ్బి)ని 2006 మే 1న మొరేల్స్ జాతీయం చేయటం ఆర్థిక వ్యవస్థలో పెనుమార్పులకు నాంది పలికింది. 2016లో బొలీవియాను సంపూర్ణ అక్షరాస్యతా దేశంగా యునెస్కో ప్రకటించింది. బొలీవియా సహజ వనరుల సేకరణ, పారిశ్రామికీకరణ, వ్యవసాయాధారిత పారిశ్రామిక రంగాన్ని మరింత విస్తరించటంపైనే ఆధారపడింది. వీటిని కొనసాగించడానికి మొరేల్స్ ఈ ఎన్నికల్లో విజయం సాధించటం అవసరం.
ఈ ఎన్నికల ప్రాధాన్యత ఏంటి?
1990లలో నయా సరళీకరణ విధానాల దశాబ్దిలో ఎదురయిన అణచివేతకు ప్రతిస్పందనగా అట్టడుగుస్థాయి నుండి ఉద్యమాలు విస్తరించటంతోపాటు వామపక్ష ప్రగతిశీల అభ్యర్థులు ఎన్నికల్లో ఘన విజయం సాధించటంతో ఆ కాలాన్ని లాటిన్ అమెరికా ప్రగతిచక్రంగా పరిగణిస్తారు. బ్రెజిల్లో లూలా డిసెల్వా, వెనిజులాలో హ్యుగో ఛావెజ్ 1999లో ఎన్నిక కాగా, ఆ సమయంలో బొలివేరియన్ విప్లవం కొనసాగుతోంది. అర్జెంటీనాలో నెస్టర్ కిర్చనర్, క్రిస్టినా ఫెర్నాండెజ్ డి కిర్చనర్లు, ఈక్వెడార్‌లో రాఫెల్ కొరియా, నికరాగువాలో డేనియల్ ఆర్టెగా, హైతీలో జీన్ బెర్ట్రాండ్ ఆర్టిసైడ్ వంటి ప్రగతిశీల నేతలు ఆయా దేశాలను ప్రగతి బాటలో నడిపించారు. అమెరికా సామ్రాజ్యవాద శక్తుల కుట్రలను ఎదుర్కొని క్యూబా, వెనిజులా, బొలీవియా వంటి దేశాలు పరస్పర సహకారంతో తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అర్జెంటీనాలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో అల్బర్టో ఫెర్నాండెజ్, క్రిస్టినా ఫెర్నాండెజ్ డి కిర్చనర్ నేతృత్వంలోని ప్రగతి శీల కూటమికే విజయావకాశాలు కన్పిస్తున్నాయి. ఆదివారం నాటి ఎన్నికల్లో మొరేల్స్ విజయం సాధిస్తే ఈ ప్రగతి చక్రానికి చెప్పుకోదగిన ముందడుగు పడినట్లే అవుతుంది.