రైతుల ఆత్మహత్యాలు ప్రభుత్వానికి పట్టవా
ప్రజాశక్తి-అద్దంకి
రైతులు ఆర్థిక భారాలను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు గోడు ప్రభుత్వానికి పట్టదా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. శనివారం అద్దంకి లోని దామావారిపాలెంలో రైతు పోలవరపు వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. సిపిఐ ఓదార్పుయాత్రలో భాగంగా రాష్ట్ర సిపిఐ కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఐ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం తరుపున అందించాల్సిన నగదును వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతు ఆత్మహత్య చేసుకుంటే రూ. 7లక్షలు అందిస్తామని ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కాలేదన్నారు. ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తున్నాయి కొత్త ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ రైతుల జీవితాలలో ఎలాంటి మార్పు ప్రభుత్వాలు తీసుకురావడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. మండలంలోని శాంతినగర్‌కు చెందిన ఆత్మహత్య చేసుకున్న రైతు హనుమంతరావు కుటుంబాన్ని పరామర్శించారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రావుల వెంకయ్య, కెవివి ప్రసాద్, జిల్లా సెక్రెటరీ నారాయణ, వి హనుమారెడ్డి, మానం వెంకటనారాయణ, గొల్లపూడి వెంకటేశ్వర్లు, కెఎల్డి ప్రసాద్, శింగరకొండ, మన్నం త్రిమూర్తులు, పాల్గొన్నారు.
- ప్రజా సమస్యలపై రైతన్నకు ఎల్లప్పుడూ వెన్నంటి ఉండే ప్రజాస్వామ్య వాదులు, వామపక్షాల వారు రైతుల ఆత్మహత్యల పట్ల ఎంతో సానుభూతి ప్రకటిస్తున్నారని అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు అన్నారు. రామకృష్ణ కు పలు సమస్యలను వివరించారు. .మార్టూరు రూరల్: తీసుకున్న బ్యాంకు రుణం తీర్చలేదని సిబ్బంది పెట్టే వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపం చెంది తన వ్యవసాయ భూమిలోనే ఆత్మహత్య చేసుకున్న రైతు శాఖమూరి హనుమంతరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాల్లో భరోసా కల్పించేందుకు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా శనివారం మార్టూరు మండలంలోని రాజుపాలెం గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్న శాంతినగర్ కాలనీలో రైతు హనుమంతరావు కుటుంబ సభ్యులను రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణతో కలసి రామకృష్ణ పరామర్శించారు. రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వాలు ఎన్ని మారినా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫల మవుతున్నాయన్నారు. రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య మాట్లాడారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ వెంకట్రావు, రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీను, వి హనుమారెడ్డి, యువజన సమైక్య జిల్లా అధ్యక్షులు పి రవి, వీరారెడ్డి, శింగరకొండ, నరసింహం, రెడ్భాషా పాల్గొన్నారు.
