ప్రజాశక్తి -మద్దిలపాలెం
ఆంధ్రాయూనివర్సిటీ భూములపై ఆంధ్రజ్యోతి దినపత్రిక అసత్య కథనాలు ప్రచురించడం మానుకోవాలని వైఎస్ఆర్ విద్యార్థి సంఘం విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు బి.కాంతారావు అన్నారు. మంగళవారం ఎయులోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం ఆ పత్రికలో 'ఎయు భూములకు కాళ్లు' అనే శీర్షికతో వచ్చిన కథనాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రజాసంక్షేమానికి పాటుపడుతూ, ఉన్నత విద్యలో సమూల మార్పులకు కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వంపై వైసిపి ప్రభుత్వంపై బురద చల్లడం తగదన్నారు. గత పాలకుల కాలంలో ఓయూ భూ ఆక్రమణలు ఆ పత్రిక దృష్టికి రాలేదా అని ప్రశ్నించారు. 1997-2002 మధ్యకాలంలో మధుర వార్డులోని ఎయు స్థలాన్ని గృహ సముదాయాలకు ధారాదత్తం చేయడం, 1999లో హనుమంతవాక లోని నాలుగు ఎకరాల భూమి గురించి అప్పటి రిజిస్టర్ నిర్వాకాన్ని ఎందుకు ప్రశ్నించలేదు అన్నారు. ఎయు అవుట్ గేట్లో ఉన్న స్థలంలో ఇపిడిసిఎల్ కు 500 చదరపు గజాలు ఇస్తే 1200 చదరపు గజాలు ఆక్రమించుకొని అందుకోమని ప్రోత్సహించిన అప్పటి రిజిస్ట్రార్పై నిజాలు ఎందుకు రాయలేదు అన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రెండు ఎకరాలు భూమిని కమ్యూనిటీ హాల్ పేరుతో కాజేశారు, ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లేదారిలో ఎమ్మెల్యే అండతో అతని అనుచరులు బట్ట వెంకటరమణ భూముల ను ఏ విధంగా వినియోగించుకున్నారనేది రాయలేక పోయారని విమర్శించారు. గతంలో యూనివర్సిటీ బ్లాక్ గ్రాంటు రూ 130 కోట్లు పసుపు కుంకుమ పథకానికి మలిస్తే ఎందుకు ఊరుకున్నారు. రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అవాకులు చవాకులు రాస్తే ఊరుకునేది లేదన్నారు. సమావేశంలో ఏయూ వైయస్సార్ విద్యార్థి సంఘం అధ్యక్షులు బి.మోహన్, రాష్ట్ర కార్యదర్శులు ఎం.కల్యాణ్, ఎం.సురేష్, బి.జోగారావు, విద్యార్థి నాయకులు సుధీర్, క్రాంతి కిరణ్, కే సాయి కృష్ణ, పవన్, నిషేక్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
ఎయు భూములపై అసత్య కథనాలు మానుకోవాలి
