సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా
ప్రజాశక్తి - కావలి
గత ఆరు రోజులుగా పనులకు ఆపివేసిన పారిశుధ్య కార్మికులను తిరిగి పనిలో పెట్టుకోవాలని కోరుతూ ఎ.పి.మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్(సిఐటియు) ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ధర్నా అనంతరం సబ్‌కలెక్టర్ సిహెచ్.శ్రీధర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ గౌరవాధ్యక్షులు పి.పెంచలయ్య మాట్లాడుతూ నాలుగు నెలలుగా పారిశుధ్య కార్మికులకు బకాయి ఉన్న జీతాలను తక్షణం అందజేయాలని కోరారు. అంతేగాక ఏప్రిల్ 3వతేదీన అప్పటి మున్సిపల్ కమిషనర్ ఎస్.కె.ఫజులుల్లా ''పట్టణ పారిశుధ్య అవసర నిమిత్తం పారిశుధ్య కార్మికులు కావాలని, ఆసక్తి ఉన్నవారు కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని'' పత్రికా ప్రకటనలిచ్చి, కార్మికులను పనిలో పెట్టుకున్నారని తెలిపారు. అప్పటి నుంచి పనిచేస్తున్న కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేదన్నారు. చుట్టు ప్రక్కల గ్రామాల్లో వివిధ పనులు చేసుకుంటున్న వారిని పిలిపించి, పనిలో పెట్టుకుని, నాలుగు నెలల జీతాలు కూడా ఇవ్వక, ఇప్పుడు పనుల్లోంచి, ఆపేశారని పేర్కొన్నారు. తక్షణం తీసేసిన కార్మికులందరినీ తిరిగి పనిలో పెట్టు కోవాలని, అందరికీ బకాయి ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. సొంగా వెంకటరమణయ్య, సొంగా రవీంద్ర, పరుసు అన్వేష్, దిలీప్, యూనియన్ నాయకులు టి.పద్మ, మాలకొండయ్య, ఎండ్లూరి రవి, ఎస్.వెంకయ్య, డివైఎఫ్ఐ నాయకులు పి.పెంచల నరసింహం, వై.కృష్ణమోహన్, కార్మికులు పాల్గొన్నారు.
సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా
