- గోదావరిలో నీరున్నా ఎత్తిపోతలకు నో
- ఘాట్ల పనుల కోసం వరద నీరంతా సముద్రం పాలు
జిఎస్ లాల్, రాజమండ్రి ప్రతినిధి
గోదావరి పుష్కరాల్లో యాత్రికుల స్నానాల కోసం గోదావరిలో సీలేరు నీటిని నిల్వచేసి, మెట్ట ప్రాంత ఖరీఫ్‌కు నీరు ఇవ్వని వైనం ఇది. గతనెలలో మహారాష్ట్ర, ఖమ్మం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తింది. ఆ నీటిని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నిల్వచేసి, మెట్ట ప్రాంతాలకు ఎత్తిపోతల పథకాల ద్వారా అందించకుండా, సుమారు 300 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రం పాలు చేశారు. వరద నీటితో రాజమండ్రిలోని కోటిలింగాల ఘాట్, పుష్కర ఘాట్ మునిగిపోయాయి. ఘాట్ పనుల నేపథ్యంలో వరదలు రావడంతో మెట్లు నీట మునిగి నాణ్యతా లోపాలు బయటపడ్డాయి. వరద నీటిని సముద్రంలోకి వదలకపోతే ఘాట్ల పనులు పూర్తికావని భావించిన ప్రభుత్వం నీటిని నిల్వ చేయకుండా సముద్రం పాలు చేసింది. ఫలితంగా మెట్ట ప్రాంతంలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన పుష్కర ఎత్తిపోతల పథకం ప్రధాన కాల్వ ద్వారా 88,158 ఎకరాలు, 11 సబ్ లిఫ్ట్‌ల ద్వారా 97,750 ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. గోదావరిలో ప్రస్తుతం నీరు ఉన్నప్పటికీ పుష్కర స్నానాల కోసం ఖరీఫ్‌కు నీరు ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. వెంకటనగరం, చాగల్నాడు, తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకాల ద్వారా సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉన్నప్పటికీ ఈ పథకాలకూ నీరు విడుదల చేయలేదు. ఈ ఖరీఫ్ సీజన్లో ఉభయగోదావరి జిల్లాల్లో 10 లక్షల 78వేల 126 ఎకరాలకు 178.50 టిఎంసిల నీరు అవసరమని నీటిపారుదలశాఖ అంచనా వేసింది. వాస్తవంగా తూర్పు డెల్టాలో రెండు లక్షల ఎకరాలు, పశ్చిమ డెల్టాలో 6 లక్షల 50 వేల ఎకరాలు, మధ్య డెల్టాలో 1.90 లక్షల ఎకరాలు, ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో 2.30 లక్షల ఎకరాలు సాగవ్వాల్సి ఉంది. నీటి కొరత కారణంగా ఈ లక్ష్యం నెరవేరడంలేదు. జూన్ 15వ తేదీ నాటికి గోదావరిలో 5,500 క్యూసెక్కుల ప్రవాహం ఉండటంతో సీలేరు నుంచి రోజుకు మూడు వేల క్యూసెక్కుల నీటిని తరలించి ఖరీఫ్‌ను కాపాడాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. ఇంతలో నైరుతి రుతుపవనాలు వస్తే ఖరీఫ్‌కు ఢోకా ఉండదని భావించింది. ఈ ఖరీఫ్ లక్ష్యానికి అనుగుణంగా గతనెల 15వ తేదీన ఉభయగోదావరి జిల్లాల డెల్టా కాల్వలకు నీరు విడుదల చేయడంతో తూర్పు, పశ్చిమ, మధ్య డెల్టా రైతులు ఖరీఫ్ పనులు ప్రారంభించారు. మెట్టకు వారం రోజుల్లో ఎత్తిపోతల పథకాల ద్వారా నీరిస్తామని జలవనరులశాఖ అధికారులు చెప్పినప్పటికీ ఇప్పటికీ ఇవ్వలేదు. గతనెలలో అల్పపీడనం కారణంగా కురిసిన వర్షాలకు మెట్ట రైతులు దుక్కులు, నారుమళ్ల పనులు చేపట్టారు. ఇంతలో వర్షాలు మొహం చాటేశాయి. ఎండలు మండుతున్నాయి. ఫలితంగా వరి నారుమళ్లు, పత్తి మొక్కలు ఎండిపోతున్నాయి. కూరగాయల పంటలూ నీటి కోసం ఎదురు చూస్తున్నాయి.
గతనెలలో గోదావరికి వచ్చిన వరదల వల్ల రాజమండ్రిలోని పుష్కర ఘాట్లు మునిగిపోయాయి. పనుల్లో నాణ్యతా లోపాల వల్ల కోటిలింగాల ఘాట్‌లో టైల్స్ పైకి లేచిపోయాయి. ఘాట్ వద్ద పెద్ద సొరంగం ఏర్పడి నాణ్యతా లోపాన్ని ఎత్తిచూపింది. దీంతో భయపడిన జలవనరులశాఖ ధవళేశ్వరం బ్యారేజీకి చెందిన 175 గేట్లను 2 మీటర్ల మేర పైకి లేపి రోజుకు 25 లక్షల క్యూసెక్కుల నుంచి 30 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేసింది. ఖరీఫ్ పనుల కోసం మెట్ట రైతులు సాగునీటి కోసం ఎదురు చూస్తున్న్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పుష్కర, చాగల్నాడు, వెంకటనగరం, తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని మళ్లించి ఉంటే తమకు ఖరీఫ్ ఇబ్బందులు తప్పేవని రైతులు అంటున్నారు. ప్రస్తుతం సీలేరు నుంచి రోజుకు మూడు వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి తీసుకొస్తున్నారు. రాజమండ్రి, కొవ్వూరు స్నాన ఘట్టాల్లో జలకళ సంతరించుకుంది. ఉభయగోదావరి జిల్లాల్లో పుష్కరాలకు వచ్చే లక్షలాదిమంది యాత్రికులు స్నానాలు చేసేందుకు గోదావరి నీటిని నిల్వ చేస్తున్నారు. మెట్ట ప్రాంతానికి ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం చొరవ చూపడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ పంటల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎత్తిపోతల పథకాల ద్వారా నీటిని విడుదల చేయాలని మెట్టప్రాంత రైతులు కోరుతున్నారు.