మసాలా కూర
కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ- ఒకటి, ఉల్లిపాయ- ఒకటి, వేరుశెనగపప్పు-1/2 కప్పు, కొబ్బరి ముక్కలు-1/2 కప్పు, పసుపు-1/4 టీ స్పూను, ఆవాలు-1/2 టీ స్పూను, జీలకర్ర-1/2 టీ స్పూను, నూనె-మూడు టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్- ఒక టేబుల్ స్పూను, గరం మసాలా- ఒక టీ స్పూను, కారం-ఒక టీ స్పూను, ఉప్పు- రుచికి సరిపడా, నీళ్ళు- ఒక కప్పు
తయారీ
పొట్లకాయ పై పొట్టు గీసి గుండ్రంగా ముక్కలు కోసుకోవాలి. వేరు శెనగపప్పులు వేగించుకొని కొబ్బరితో కలిసి మెత్తగా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేగించాలి. తరువాత పొట్లకాయ ముక్కలు వేసి అవి కొంచెం ఉడికాక వేరుశెనగ కొబ్బరి పేస్టు, ఉప్పు, పసుపు, కారం వేసి నీళ్ళు పోసి ఉడికించాలి. కూర దగ్గర పడ్డాక గరం మసాలా జల్లి దించేయాలి.
పెరుగు పచ్చడి
కావాల్సిన పదార్థాలు
పొట్లకాయ- చిన్న ముక్క
పెరుగు- ఒక కప్పు
పచ్చిమిర్చి- నాలుగు
జీలకర్ర- ఒక చెంచా
పచ్చికొబ్బరిపొడి- రెండు చెంచాలు
కొత్తిమీర- అరకప్పు
ఆవాలు- రెండు చెంచాలు
అల్లం వెల్లుల్లి ముద్ద- చెంచాడు
మినప పప్పు- చెంచాడు
ఎండు మిర్చి-ఒకటి
కరివేపాకు- రెండు రెమ్మలు
పసుపు, ఉప్పు- తగినంత
ఇంగువ- కొద్దిగా
తయారీ
ముందుగా పొట్లకాయ ముక్కలు కడిగి ఉడికించి పెట్టుకోవాలి. పై దినుసులతో ముద్ద చేసుకోవాలి. ఒక గిన్నెలో పెరుగు తీసుకొని దానిలో పైన తయారు చేసిన ముద్ద, పొట్లకాయ ముక్కలు వేసి తగినంత ఉప్పు కలిపి తాలింపు చేసుకోవాలి. అందులో చిటికెడు పసుపు, ఇంగువ వేసి చల్లారాక పెరుగులో కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే కమ్మని పెరుగు పచ్చడి రెడీ!
పల్లీ పొడితో కూర
కావాల్సిన పదార్థాలు
పొట్లకాయ - ఒకటి, ఉల్లిపాయ తరుగు-అరకప్పు, ఆవాలు,జీలకర్ర, మినపప్పు, శనగపప్పు-అర టీ స్పూను చొప్పున, ఉప్పు-తగినంత, నూనె-ఒక టేబుల్ స్పూను, ఎండు మిర్చి-ఆరు, వెల్లుల్లి రేకలు-ఆరు, వేరుశెనగపప్పులు- అరకప్పు, కరివేపాకు-నాలుగు రెబ్బలు, పసుపు-అర టీ స్పూను, ఇంగువ- చిటికెడు, కొత్తిమీర తరుగు-అరకప్పు
తయారీ
పొట్లకాయని ముక్కలుగా తరిగి చిటికెడు పసుపు కలిపి, కప్పు నీటితో ఉడికించాలి.( ముక్క సగం ఉడికితే చాలు) ఎండుమిర్చి, వేరుశనగపప్పులను విడివిడిగా వేగించి వెల్లుల్లితో కలిపి పొడి చేయాలి. నూనెలో తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ, పసుపు, ఉల్లితరుగు వేగించి ఉడికిన ముక్కలు కలపాలి. ఐదు నిమిషాలు మగ్గించి ఉప్పు, వేరుశనగ పొడి మిశ్రమం కలపి మరో రెండు నిమిషాలు ఉంచి కొత్తిమీర చల్లి దించేయాలి.
ఆవకూర
కావాల్సిన పదార్థాలు
పొట్లకాయ ముక్కలు- రెండు కప్పులు
నువ్వులు- రెండు చెంచాలు
ఎండు మిర్చి-నాలుగు
ఆవాలు- రెండు చెంచాలు
నూనె- నాలుగైదు చెంచాలు
ఉప్పు- తగినంత
పసుపు- కొద్దిగా
తయారీ
బాణలిలో నూనె వేడిచేసి అర చెంచా ఆవాల్ని వేయించుకోవాలి. ఇప్పుడు కడిగిన పొట్లకాయ ముక్కలూ, పసుపూ వేసి మూతపెట్టేయాలి. మధ్య మధ్య కొద్దిగా నీళ్లు చల్లుతూ ఉంటే కూర మగ్గుతుంది. ఇంతలో పొయ్యి మీద మరో బాణలి పెట్టి నూనె లేకుండా నువ్వుల్ని వేయించుకుని తీసుకోవాలి. వేడి చల్లారాక నువ్వులూ, మిగిలిన ఆవాలు నానబెట్టిన ఎండుమిర్చి తీసుకుని మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. కూర పూర్తిగా మగ్గాక తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మంట తగ్గించి ముందుగా చేసి పెట్టుకున్న ఆవ మిశ్రమాన్ని వేసి కలిపి వెంటనే దింపేస్తే కమ్మని పొట్లకాయ అవకూర సిద్ధం.
పొట్లకాయ వెరైటీలు
