ఇసుకపై అపోహలు వద్దు
ప్రజాశక్తి-గిద్దలూరు
భవన నిర్మాణ రంగ కార్మికులు, ప్రజలకు ఇసుకపై ఎలాంటి అపోహాలు వద్దని ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు తెలిపారు. ఇసుక వారోత్సవాల్లో భాగంగా స్థానిక మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన ఇసుక డిపోను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్నా వెంకటరాంబాబు మాట్లాడుతూ ఇటీవల అధిక వర్షాలు కురవడంతో ఇసుక కొరత ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇసుక విధానంతో వినియోగదారులు నేరుగా ఇసుకను కొనుగోలు చేయవచ్చునన్నారు. ఈ నూతన విధానం ద్వారా ఇసుక అక్రమ రవాణా జరగదన్నారు. ఒక్కోక్క లబ్ధిదారుడు తమ ఆధార్‌కార్డుపై 5.5 టన్నుల ఇసుకను పొందవచ్చునని తెలిపారు. మరో మూడు రోజుల తరువాత అదే ఆధార్‌పై మరో 5.5 టన్నుల ఇసుకను పొందవచ్చునని తెలిపారు. ఇసుక టన్ను రూ.1,250 నిర్ధారించినట్లు తెలిపారు. గిద్దలూరు ఏర్పాటు చేసిన డిపో నుంచి చిన్నచిన్న గృహాల నిర్మాణాలకు మాత్రమే ఇసుక సరఫరా చేస్తున్నట్ల తెలిపారు. లారీ ఇసుక అవసరమైన వారు ఒంగోలు, కర్నూలు, కడప ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవాలన్నారు. గిద్దలూరుకు కడప నుంచి ఇసుక వచ్చిందని, ఆ ఇసుక నాణ్యత బాగుందన్నారు. ఈ సందర్భంగా కూలీలు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబును సన్మానించారు. ఇసుక లోడింగ్ యంత్రాల ద్వారా కూలీలతో చేయిస్తే తమకు జీవనోపాధి కలుగుతుందని ఈ సందర్భంగా కూలీలను ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై అధికారులతో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుంటానని ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎపిఎంబిసి ఒంగోలు, కడప అధికారులు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు కోటా నరసింహులు, సిహెచ్.రంగారెడ్డి, ఆర్డి.రామ కృష్ణ, మాజీ ఎంపిపి కడప వంశీధర్‌రెడ్డి, డాక్టర్ భూమా నరసింహారెడ్డి, ముద్దర్ల శ్రీను, బాదం గోపాల్, కృష్ణారెడ్డి, మేకల భయన్న యాదవ్, బి.రామ కృష్ణారెడ్డి, విఆర్ఐ.మురళీ, వి.నాగేశ్వరరావు, కటారు అరుణ్‌కుమార్, వైసిపి నాయకులు, కార్యకర్తలు, లారీ యజమానులు, కూలీలు పాల్గొన్నారు.
ఇసుకపై అపోహలు వద్దు
