ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
వాలంటీర్లు వ్యవస్థ ఉద్యోగం కాదనీ, కేవలం సేవా దృక్పథం ఉన్న వారు మాత్రమే ఇందులో కొనసాగాలని శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు సూచించారు. శుక్రవారం నగరంలోని వైఎస్ఆర్ కల్యాణ మండపంలో నియోజకవర్గంలో నియమితులైన వాలంటీర్లకు నియామకపత్రాలను అందజేసే కార్యక్రమంలో ధర్మాన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజల అవసరాలను తీర్చిదిద్దే పెద్ద ప్రయత్నం చేస్తున్నారనీ, అందులో సేవకులుగా వాలంటీర్లు పని చేయాల్సి ఉందన్నారు. అవకాశం దక్కించుకున్న వారు ప్రతి 50 ఇళ్లకూ ఒక ప్రతినిధి చొప్పున పని చేయాల్సి ఉంటుందన్నారు. మీరు అందించే సేవల ద్వారా సంక్షేమ పథకాలు కావాల్సిన కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అందుతాయని గుర్తు చేశారు. ఇందులో 50 శాతం మహిళలకు అవకాశం కల్పించామ న్నారు. గ్రామాల్లో మంచి సేవలు అందించి ప్రజల హృదయంలో చిర స్థాయిగా నిలవాలన్నారు. ప్రతి ఒక్కరూ అన్ని అంశాలకూ, శాఖలకు సంబందించిన పరిజ్ఞానం పెంపొం దించుకోవాలన్నారు. గ్రామాల్లో పచ్చదనం, భూగర్భజలాల పర్య వేక్షణ, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. అవినీతి లేని రాష్ట్రాన్ని తయారు చేయాలనే ముఖ్యమంత్రి ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వానికి, ప్రజలకు మంచి అనుసంధానకర్తలుగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి బి.గోపాలకృష్ణ, డిసిఎంఎస్ అధ్యక్షులు జి.కృష్ణమూర్తి, తహశీల్దార్ ఐ.టి.కుమార్, చిట్టి జనార్ధనరావు, ఎచ్చెర్ల సూర్యనారాయణ, సిమ్మ రాజశేఖర్ పాల్గొన్నారు.
ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
