రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా అటు ఎండదెబ్బ గానీ, ఇటు ఆర్టీసీ సమ్మె వంటి పోరాటాలు గానీ దాదాపు ఒకే విధంగా ఉండటం ఆసక్తికరం. కేంద్ర, రాష్ట్రాల పాలకులు కూడా సామరస్యం కోసం ఎలాటి ప్రయత్నం చేయకపోయినా ప్రజలు వివాద రహితంగానే గత సంప్రదాయాలు కొనసాగించ డం సంతోషకరం. ఏడాది కాలపు అనుభవాలను నిశితంగా పరిశీలించి నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తేనే రానున్న కాలంలోనైనా ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది.
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏడాది పూర్తి హడావుడి చేసేందుకు సిద్ధమవుతున్నది. తెలంగాణ ఆవిర్భావ వార్షికోత్సవానికి కెసిఆర్ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తున్నది. తనూ వెనకబడలేదన్నట్టు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నవ నిర్మాణ దీక్షకు పిలుపునిచ్చింది. మే 28 మహానాడు హైదరాబాదులో భారీ ఎత్తున నిర్వహించడం ద్వారా తెలంగాణలోనూ ఉనికిని చాటుకోవాలనుకుంటున్నది. ప్రధాన ప్రతిపక్షాల పరిస్థితీ అలాగే ఉంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మధ్యంతర విరామం తర్వాత రంగంలోకి వచ్చి విమర్శల శరపరంపరతో పాటు తెలంగాణలోనూ పర్యటించి వెళ్లారు. ఎపికి కూడా వస్తారని చెబుతున్నారు. ఇక ఎపి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన రెడ్డి ఏడాది తర్వాత తన పర్యటనలు, ఖండనల జోరు పెంచడమే గాక రాజధాని సమీపంలో నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నారు. జనతా పరివార్ కలుస్తుందో, లేదో తెలియని అయోమయం ఒకవైపున ఉంటే జయలలిత అట్టహాసంగా అధికార పున్ణప్రవేశం చేశారు. మొత్తంపైన ఇవన్నీ రాజకీయ రంగంలో నాటకీయ వేడిని చూపిస్తున్నాయి. ప్రజలు మాత్రం నిజమైన ఎండ వేడికి మాడుతూ వడదెబ్బలకు పిట్టల్లా రాలిపోతున్నారు!
కేంద్రంలో...
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం సంగతే చూస్తే ఏడాది కిందట వారెంతో ఆర్భాటంగా అధికారం స్వీకరించిన నాటి ప్రభావం, ప్రాభవం ఇంత త్వరగా మసకబారిపోవడం ఆశ్చర్యం అనిపించవచ్చు. కానీ నిజంగా అది చాలా సహజ పరిణామం. గత ప్రభుత్వాల ఆర్థిక విధానాలను మార్చకపోగా మరింత ఉధృతం చేస్తూ మరో వంక మతతత్వ విషాన్ని కూడా కూరిన తర్వాత ఆ ప్రభుత్వం ప్రజారంజకంగా ఉండటం ఆచరణ సాధ్యమయ్యేది కాదు. భూ సేకరణ బిల్లుతో పరాకాష్టకు చేరిన కార్పొరేట్ ఒత్తిళ్లు ఆ తర్వాత బాల శ్రామికులను అనుమతించిన మార్పులోనూ ప్రస్ఫుటమయ్యాయి. ఏడాది తర్వాత చెప్పుకోవడానికి ప్రగతి ఏమిటంటే-ఇన్ని దేశాలు పర్యటించారు, ట్విట్టర్లో ఆయనను ఇంత మంది అనుసరిస్తున్నారు వంటి కబుర్లు, కథలే చెబుతున్నారు. వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ వంటి సీనియర్లు ఆయనను సమర్థించేందుకు అవస్థలు పడుతున్నారు. నేను కష్టపడి పనిచేసినందుకు నన్ను విమర్శిస్తున్నారని మోడీ చైనాలో వాపోతున్నారు. ఒక ప్రధాన మంత్రి తన గొప్పతనం ప్రచారం చేసుకోవడానికి విదేశాలను వేదికగా చేసుకుంటున్నారంటేనే దాని మీద వేరే వ్యాఖ్యానం అవసరం లేదు. పరిస్థితికి మరో ఉదాహరణ ఏమంటే ఘర్‌వాపసీ వంటి మతతత్వ అంశాలను పక్కన పెట్టి స్వచ్ఛ భారత్ తరహా ప్రచార కార్యక్రమాలపై కేంద్రీకరించాలని ఆరెస్సెస్ అధికారికంగా ఇచ్చిన ఆదేశం! అరుణ్ శౌరి వంటి మితవాద మేధావులు కూడా జీర్ణించుకోలేనంత కార్పొరేటీకరణ. అద్వానీ ప్రభృతులు కూడా కనిపించనంత వ్యక్తి కేంద్రీకరణ. క్రిసల్ రేటింగులోనూ, టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వేలోనూ కూడా మోడీ ప్రభ తగ్గుముఖం పట్టిందన్న లెక్కలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన వాగ్దానాల విషయంలో వెనక్కు పోవడమే గాక అర్థం లేని ఎదురు దాడి చేస్తున్న వైనం. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలని బిల్లు తెచ్చిన వారే ఇప్పుడు కేజ్రీవాల్‌పై కక్ష తీర్చుకోవడానికి తలకిందులుగా వ్యవహరిస్తూ వాదనలు చేస్తున్న వైపరీత్యం. ఏతావాతా ఏడాది చివరన మోడీ సర్కారుపై భ్రమలు పూర్తిగా తొలగాయని కాదు గాని దాని స్వభావం ఏమిటో ప్రజలు తెలుసుకోవడానికి ముఖ్యంగా శ్రమజీవులు, ఉద్యోగ, కార్మికులు, రైతులు, సామాజిక తరగతులకు కనువిప్పు కలగడానికి అనేక పరిణామాలు దోహదం చేశాయన్నది నిజం. ఢిల్లీలో బిజెపి తిన్న దెబ్బ ఒకటైతే బెంగాల్లోనూ వారే ప్రధాన శక్తి అనడం స్థానిక ఎన్నికల్లో తేలిపోయింది. ఇక బీహార్ ఎన్నికలతో విషయం మరింత స్పష్టం కానుంది. రాజ్యసభలో తిన్న, తింటున్న ఎదురుదెబ్బలతో రాష్ట్రాల ఆశలు తగ్గించుకుని గతంలో వలె మమతనూ, జయలలితనూ అంటకాగడానికి సిద్ధమవుతున్నారా అని కూడా సందేహాలు వస్తున్నాయి. మొత్తంపైన మోడీ అజేయత్వం, అమిత్‌షా సహాయంతో ఆయన అఖిలభారత జైత్రయాత్ర చేసేస్తారన్న అమిత అంచనాలు ఇప్పుడు అపహాస్యం పాలవుతున్నాయి.
తెలంగాణలో...
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే దీర్ఘ కాల ఉద్యమంతో సాధించుకున్న తెలంగాణ ఏడాది తర్వాత షరా మామూలుగా అన్ని సమస్యలకూ, వాద వివాదాలకు కేంద్రంగా ఉంది. గతంలో(9.5.15) వ్యాసంలో చెప్పుకున్నట్టు తెలంగాణ వాదాన్ని బలంగా ముందుకు తెచ్చిన వారు కూడా నిరుత్సాహానికి గురై నిరసన తెల్పుతున్న స్థితి. పోటీ జెఎసిలు ఒకవైపు.. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నిరసనలు మరో వైపు వినిపిస్తున్నాయి. రైతాంగం ఆత్మహత్యలపై స్పందనలేకపోవడంతో గ్రామీణ దృశ్యం కూడా ఆందోళనలకు నిలయమవుతున్నది. సామాజిక న్యాయం విషయంలోనూ నిర్దిష్టమైన చర్యలు లేకపోగా ఒక విధమైన ఫ్యూడల్ ధోరణి పెరుగుందని భావిస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాద త్రయంలో ప్రాజెక్టుల పురోగమనం లేకపోగా ఆలస్యమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిధులు ఉన్నట్టు చెబుతున్నా కేటాయింపులు శాస్త్రీయంగా లేకపోవడం, ప్రాధాన్యతాక్రమం పాటించకపోవడం విమర్శలు పెంచుతున్నది. ఇక నియామకాల విషయంలో నిర్దిష్ట చర్యల కన్నా నిర్లిప్తతే అధికంగా ఉంది. ఇన్ని కారణాల వల్ల మొదటి ఏడాదిలో ఆనందం తాండవిస్తున్న సూచనలు గోచరించడం లేదు. దీనికి తోడు ఏడాది చివరన స్వచ్ఛ భారత్ చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఉస్మానియా భూములపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యానాలు విద్యార్థిలోకంలోనూ, విద్యారంగంలోనూ ఆగ్రహం తెప్పించాయి. అంతకు ముందు కాలంలో ఉద్యమానికి గుండెకాయగా భావించిన ఉస్మానియాపైనే కాలు దువ్వడం వ్యూహాత్మకమేనన్న భావం ఒక విధమైన యాంటీ క్లైమాక్స్‌గా మారింది. బంగారు తెలంగాణ అంటూనే భవనాల నిర్మాణం, స్థలాల గురించిన చర్చ అధికమై పోయింది. బంగారు తెలంగాణ అన్న మాట చివరకు ఫిరాయింపుదార్లతో కూడిన బిటి బ్యాచి(బంగారు తెలంగాణ బ్యాచి), యుటి బ్యాచి(ఉద్యమ తెలంగాణ బ్యాచి) వంటి సరికొత్త పదజాలానికి పుట్టుక నిచ్చిన తీరు కనిపిస్తుంది. దీనికి తోడు రాజకీయంగా బిజెపితో పొత్తుకు ఎత్తులు, కేంద్ర మంత్రివర్గంలోనైనా చేరాలనే తహతహ ఒకవైపు-మజ్లిస్‌తో చెట్టపట్టాలు మరో వైపు ద్వంద్వ నీతికి దర్పణం పట్టడమే గాక లౌకికతత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రతి దానికీ గత ప్రభుత్వాలను, సమైక్య రాష్ట్రాన్ని తిట్టిపోస్తుంటే ప్రయోజనం ఏమిటని రోజూ సవాళ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విభజన వల్ల వచ్చే సారైనా లాభం పొందాలనే కాంగ్రెస్ ఆశలు, కేంద్రాన్ని ఆసరా చేసుకుని తిష్ట వేయాలని బిజెపి ఎత్తులు, అవసరాన్ని మించిన దూకుడుతో గజిబిజిగా వ్యవహరిస్తున్న తెలుగు దేశం పోకడలు మరో వైపు తెలంగాణ రాజకీయాన్ని చిందరవందరగా మార్చాయి. సిపిఎం, వామపక్షాలు ఈ వాతావరణంలో రాజకీయ ఐక్యతతో పాటు సామాజిక తరగతులనూ ఉద్యమాలను కూడా కలుపుకుంటూ ప్రత్యామ్నాయం పెంపొందించాలనే ప్రయత్నం చేయడం కూడా ఆలోచనా పరులను ఆకర్షిస్తున్నది. సహజంగానే వార్షికోత్సవం ఘనంగా జరిగినా అసలైన పునస్సమీకరణలు తర్వాత ప్రారంభం కావచ్చు.
ఆంధ్ర ప్రదేశ్‌లో...
ఇక రాజధాని రహితమైన విభజిత ఆంధ్రప్రదేశ్ సంగతి మరింత అయోమయం. చంద్రబాబు నాయుడు అనుభవం, సమర్థత వంటి విషయాలపై ఎంతగా ప్రచారం చేసుకున్నా వాస్తవానుభవం అందుకు భిన్నంగా ఉంది. అమరావతి పేరు, సింగపూర్ యాత్రలు, రైతుల నుంచి భూ సమీకరణ/సేకరణ వంటి హంగామా చాలా జరిగింది. దీనికి సంబంధించి ఎలాటి ప్రజాస్వామిక పారదర్శక విధానాలు లేకపోవడంతో ఏడాది తర్వాత గందరగోళం మరింత పెరిగింది. న్యాయస్థానాలు కూడా వరుసగా అక్షింతలు వేసి ఆంక్షలు పెట్టినా అధికార పక్షం ఖాతరు చేయనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నది. ఎంత భూమి ఏ ప్రాతిపదికన తీసుకున్నారనే దానిపైనా రకరకాల లెక్కలతో తికమక పెడుతున్నది. దేశమంతా నిరసిస్తున్న భూ సేకరణ ఆర్డినెన్సు నిబంధనలను తీసుకుని స్థానికుల ఆమోదం, ఆహార భద్రతా నిబంధనలు మినహాయించి రాజధానిలో ప్రయోగించేందుకు సిద్ధమైంది. దీన్ని కోర్టులో సవాలు చేస్తే రెండు వారాల వరకూ ఉపయోగించేది లేదని చెప్పి కాస్త సమయం తీసుకున్నది. కానీ తర్వాతనైనా ఈ మౌలిక ప్రశ్నలు మళ్లీ రాకుండా ఉండవు. ఆదిలోనే హంసపాదులా రాజధాని నిర్మాణమే రాజకీయ రగడగా, రైతాంగంతో ఘర్షణగా మార్చిన ప్రభుత్వం అనేక పాఠాలు నేర్చుకోవలసే ఉంటుంది. పైగా రైతుల భూమిని 99 ఏళ్లు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చే ఉత్తర్వులు విడుదల చేయడంతో ఇదంతా ఒక రియల్ ఎస్టేట్ తతంగంగా మారిపోయిందన్న విమర్శలు నిజమైనాయి. సింగపూర్ ముద్రతో జరిగే ఈ ప్రహసనంలో సూత్రధారులు, పాత్రధారులు చేసేదేమిటో తెలిసే కొద్దీ ప్రజల, రాజకీయ పక్షాల స్పందన కూడా తీవ్రమవుతుంది. రకరకాల రుణమాఫీలతో సహా తానిచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో గానీ, కేంద్రం చేసిన వాగ్దానాలను సాధించుకోవడంలో గానీ ప్రభుత్వం విఫలమైంది. మొదటి సంతకంతో మాఫీ కావలసినవి ఏడాది తర్వాత ముక్కుతూ మూల్గుతూ పాక్షిక పల్లవులతో అఘోరించడం ఎవరూ కాదనలేని వాస్తవం. వ్యవసాయ సంక్షోభం విషయంలో గాని, ఉద్యోగ, కార్మికుల కోర్కెల విషయంలో గాని నిర్బంధం తాండవిస్తున్నది. నూతన రాష్ట్ర రాజధానితో సహా ఏ విషయంలోనూ ఏ పార్టీతోనూ సంప్రదించకుండా తెలుగు దేశం ఏకపక్ష పోకడలు పరాకాష్టకు చేర్చింది. బిజెపి ముప్పుతిప్పలు పెడుతున్నా తను మాత్రం అంటకాగుతున్నది. కనుక పాలకపక్షమే రేపటి పర్యవసానాలకు పూర్తి బాధ్యత వహించి మూల్యం చెల్లించవలసి వస్తుంది.
రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా అటు ఎండదెబ్బ గానీ, ఇటు ఆర్టీసీ సమ్మె వంటి పోరాటాలు గానీ దాదాపు ఒకే విధంగా ఉండటం ఆసక్తికరం. కేంద్ర, రాష్ట్రాల పాలకులు కూడా సామరస్యం కోసం ఎలాటి ప్రయత్నం చేయకపోయినా ప్రజలు వివాద రహితంగానే గత సంప్రదాయాలు కొనసాగించడం సంతోషకరం. ఏడాది కాలపు అనుభవాలను నిశితంగా పరిశీలించి నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తేనే రానున్న కాలంలోనైనా ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది.
- తెలకపల్లి రవి