ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సెక్యూరిటీ కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు చూస్తుంటే అగ్రదేశం అయిన అమెరికా అధ్యక్షుడు ఒబామాను మించి పోతారేమో అనిపిస్తోంది. తన రక్షణ కోసం సిఎం తీసుకుంటున్న జాగ్రత్తలు అలా ఉన్నాయి మరి. ప్రజలకు చేరువ కావాల్సిన సిఎం, ప్రజా సమస్యలను తీర్చాల్సిన ముఖ్యమంత్రి తన రక్షణకే తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. ఎవ్వరూ ఛేదించలేని దుర్భేద్యమైన రక్షణ కోటను ఏర్పాటు చేసుకుంటున్నారు. చీమ చిటుక్కుమన్నా డేగ కన్నుతో కనిపెట్టే సిస్టమ్‌ను సచివాలయంలోని ఎల్ బ్లాక్‌లో సిఎం ఉంటున్న ఫ్లోర్‌కు ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రికీ లేని కాన్వారుని తన కోసం కోట్ల రూపాయలు వ్యయం చేసి సిఎం చంద్రబాబు ఏర్పాటు చేసుకున్నారు. విజయవాడ, తిరుపతి, హైదరాబాద్‌లో ఆయన కాన్వారు అక్షరాలా 36 వాహనాలు. ఇంతటితో ఆగారనుకుంటే పొరపాటే. రాష్ట్రంలో తన పర్యటనకు కోట్లు కుమ్మరించి కొన్న కాన్వారు కార్లు పనికి రావని సుమారు రూ.10 కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రత్యేక బస్సు కొనుగోలు చేశారు. తన రక్షణ కోసం సిఎం తీసుకుంటున్న జాగ్రత్తలు సామాన్యులను సైతం విస్మయానికి గురిచేస్తున్న అంశం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగా లేవని అంటూనే మరో పక్క కేవలం తన రక్షణ కోసం ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం విచారం కలిగించే అంశం. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల అమలుకు లోటు బడ్జెట్‌ను సాకుగా చెబు తున్న సిఎం తన అంతరంగం లోని రక్షణ అజెండాను మాత్రం అమాం తంగా అమలు చేసుకుంటున్నారు. ప్రజా ధనాన్ని అడ్డగోలుగా వెచ్చిస్తున్న అంశాల మీద ప్రశ్నించే తత్వం ప్రజలు అలవరచుకోవాలి. ప్రభుత్వం వ్యయం చేసే ప్రతి పైసా తమదనే విషయం ప్రజలు గ్రహించాలి. వ్యయం చేస్తున్న ప్రతి రూపాయికీ లెక్కలు అడగాలి. ఆ స్థాయికి ప్రజలు ఎదగాలి. సెక్యురిటీ కోసం ఖర్చు చేస్తున్న ప్రజాధనం మీద ఎన్ని విమర్శలు చేసినా, ప్రశ్నించినా వాటిని గాలికొదిలేసి సిఎం త్వరలో బుల్లెట్‌ప్రూఫ్ విమానాన్ని కొన్నా ఆశ్యర్య పోనక్కర్లేదు.
- గరిక విజయ కుమార్