రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో స్తబ్ధతను తొలగించేందుకు సర్కారు సరికొత్త ప్రతిపాదనలను తెరమీదికి తెచ్చింది. ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేస్తామని కాంట్రాక్టర్లతో ప్రమాణం చేయించడం ద్వారా పురోభివృద్ధిని సాధించాలని యోచిస్తున్నారు. తొలుత ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచేందుకు ఇంజనీర్లు, సంబంధిత అధికారులతో ప్రమాణం చేయించాలని భావించారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి మార్పులూ ఉండబోవని ఎవరో సిఎంకు సూచించారట. ఒకవేళ అధికారులతో చేయిస్తే చేయించండి... కానీ కాంట్రాక్టర్లతో మాత్రం తప్పకుండా ప్రమాణం చేయించాలని ఆ సదరు వ్యక్తి సిఎం చెవిలో గుసగుస లాడారని చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే కాంట్రాక్టర్ల ప్రమాణ పత్రం తెరమీదికి వచ్చింది. కాంట్రాక్టర్లు ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేస్తామని ప్రమాణం చేసినా ఏం ఒరుగుతుందని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. వారి పద్ధతిలోనే వారు కొనసాగుతారు తప్ప... ప్రమాణం చేశామనో, సిఎం చెప్పారనో వారి వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోరని అంటున్నారు. కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సులు, ప్రభుత్వంలోని పెద్దలకు ముడు పులు ముట్టందే ఏ కార్యక్రమం ముందుకు పోదని అంటున్నారు. ప్రమాణ పత్రాలతో పనులు జరుగుతాయని అనుకుంటే ఈపాటికి దేశ స్థితి గతులే మారిపోయి ఉండేవని అంటున్నారు.
- సానెం నర్సనగౌడ్