* కేంద్రానికి నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ సూచన
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తాజాగా కార్పొరేట్ సంస్థలకు ప్రకటించిన పన్ను మినహాయింపులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆర్థికశాస్త్ర నోబెల్ పురస్కార విజేత డా.అభిజిత్ బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఆయన ఇటీవల ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పిఎం కిసాన్ యోజన పథకాన్ని రైతులు కాని వ్యవసాయ కార్మికులకు కూడా విస్తరించాలని అభిప్రాయపడ్డారు. ఇంటర్వ్యూ విశేషాలు క్లుప్తంగా...
ప్రస్తుతం భారత్ ఆర్థిక, ఇతర రంగాలలో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని మీరు రచించిన పుస్తకంలో వ్యాఖ్యానించారు. మీ అభిప్రాయం సరైనదేనా?
అలా అని కచ్చితంగా చెప్పలేను కానీ అందుబాటులో వున్న డేటా చూస్తే సంక్లిష్టంగా వుంది. జిడిపి డేటాను చూస్తే భారత్ పనితీరు అద్భుతం.. ఇతర డేటాను చూస్తే అంత బాగా అనిపించటం లేదు. 2014-15 తరువాత ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి నిలిచిపోయిందని ఎన్ఎస్ఎస్ డేటా చెబుతోంది. ముఖ్యంగా తలసరి వినిమయం స్థాయి అట్టడుగు స్థాయికి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో భారత ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితులనెదుర్కొంటోందన్నది నా అభిప్రాయం.
మీరు మీ పుస్తకంలో ప్రస్తావించిన టాప్ త్రీ 'గుడ్ ఎకనామిక్స్' ప్రస్తుత మాంద్య పరిస్థితుల నుండి భారత్‌ను బయటకు తెచ్చేందుకు ఉపయోగపడతాయా?
తప్పకుండా.. మనం మాంద్యంలో వున్నామను కుంటే... మరింత కష్టపడాల్సి వుంటుంది. కార్పొరేట్ పన్నుల్లో భారీగా మినహాయింపులిచ్చారు. ఈ మినహాయింపులు వద్దని నేను చెప్పటం లేదు. వీటిని రద్దుచేయటం కూడా అత్యంత వ్యయభరితమే అవుతుంది. ఇందులో పరిశీలించాల్సిన అంశాలు కూడా వున్నాయి. కార్పొరేట్ పన్ను మినహాయింపు లతో ఆర్థిక వ్యవస్థపై పెను భారమే పడుతుంది. ఈ సొమ్మును పిఎం కిసాన్ యోజన పథకంలోనూ, గ్రామీణ ఉపాధి హామీ పథకం వేతనాల పెంపుదలకూ ఉపయోగిస్తే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని నేను భావిస్తున్నాను. ఖర్చు పెట్టగలిగే వాళ్ల చేతులకు సొమ్ము అందిస్తే సత్ఫలితాలుంటాయి. కార్పొరేట్ల వద్ద టన్నుల కొద్దీ డబ్బు మూలుగుతోంది. వారు దానిని ఖర్చు చేయకపోతే వారి వద్ద వున్నా అది నిరుపయోగమే అవుతుంది కదా. డిమాండ్ లేదు కనుక పెట్టుబడి పెట్టటం లేదన్న వాదన వాస్తవ విరుద్ధం.
వాస్తవానికి పన్నుల పెంపుదల కన్నా వాటిని తగ్గిస్తే ఫలితం వుంటుందని మీ పుస్తకంలో వాదించారు కదా?
ప్రభుత్వం పన్నులు పెంచింది. ఈ బడ్జెట్లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నన్ను ఆశ్చర్య పరిచింది. అయితే వెంటనే దానిని ఉపసంహ రించుకుంది. ఇది దురదృష్టకర పరిణామమని నా అభిప్రాయం. వారు అత్యధిక స్థాయి పన్నులను కొనసాగించాల్సిన అవసరం వుంది.
పరోక్ష పన్నుల విషయానికొస్తే జిఎస్టి విధింపు విషయంలో తక్కువ స్లాబ్‌ల పరిధిలోకి మరిన్ని వస్తువులను తీసుకురావాలన్న వాదన వినిపిస్తోంది కదా? ఇవి కూడా ఎక్కువ పన్ను శ్లాబ్‌ల పరిధిలోనే వుండాలంటారా?
అలాగే అనుకుంటున్నాను... మధ్యతరగతి ప్రజ లపై పన్ను విధించకుండా జిడిపిలో ప్రభుత్వ వాటా పెరగదు. కేవలం ధనికులపై విధించే సంపద పన్ను, ఆదాయపు పన్నులతోనే జిడిపిలో ప్రభుత్వ వాటాను పెంచుకోలేం. చైనా ఈ ప్రక్రియను ఒక పద్ధతి ప్రకారం కొనసాగిస్తోంది. ఒక దశకు చేరుకున్న తరు వాత ఈ పన్ను శ్లాబ్‌లు స్థంభించిపోతాయి. అప్పుడు ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. ద్రవ్యోల్బణంతో వాస్తవ ఆదాయాలు కూడా పెరుగుతాయి. దీనితో పాటే పన్ను వసూళ్లుకూడా పెరుగుతాయి. జిడిపిలో తన వాటాను సమకూర్చుకునేందుకు చైనా ఈ విధానాన్నే అనుసరిస్తోంది. ప్రస్తుతం చైనాలో పరోక్ష పన్నులే అధికంగా వున్నాయి. ప్రభుత్వం నుండి మెరుగైన సేవలు అందుకోవాలంటే మధ్యతరగతి ప్రజలు కూడా పన్నులు చెల్లించాల్సిందేనంటూ వారు ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నారు.
మీ పుస్తకంలో పిఎం కిసాన్‌ను ప్రస్తావిస్తూ 'న్యారు' పథకం రూపకల్పనకు ఇది దోహదపడిందన్నారు. ఈ రెండింటినీ మీరు 'గుడ్ ఎకనామిక్స్' అంటారా?
పిఎం కిసాన్ విషయానికొస్తే దీనికి మద్దతు ధర విధానాన్ని కలపలేదు. ఈ పథకం ప్రధాన లక్ష్యం రైతులకు సాయం అందించటమే ఇందుకు కారణం. మద్దతు ధర విధానం ప్రత్యేకమైనది. రైతుల నుండి టన్నుల కొద్దీ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇస్తున్న హామీ ఇది. ఈ ధాన్యాలను మళ్లీ చౌకధరలకే విక్రయించాల్సి వుంటుంది. ఈ ప్రక్రియ అంతా అత్యంత పురాతనమైనది. గత అర్ధశతాబ్దకాలపు ఆర్థిక వ్యవస్థను గమనిస్తే ఈ భావన కలుగక మానదు. మారుతున్న కాలంతో మనమూ మారాలి. రైతులకు మద్దతునిచ్చేందుకు ప్రభుత్వం టన్నుల కొద్దీ ఆహారధాన్యాలను కొనుగోలుచేయాల్సిన అవసరం లేదు.
పిఎం కిసాన్ పథకం రైతులకు ఉద్దేశించినది కాగా న్యారు పథకం పేదలకు ఉద్దేశించినది. పిఎం కిసాన్‌ను విస్తరించాలంటారా?
అవుననే అంటాను.. భూమిలేని వ్యవసాయ కార్మికులను ఈ పథకం ప్రయోజనాలకు దూరం చేయటం సహేతుకం కాదు. ముఖ్యంగా మద్దతు ధర విధానానికి ఇది ప్రత్యామ్నాయమని మీరు భావించినపుడైనా సరే... మద్దతు ధర విధానం వ్యవసాయ కార్మికులకు డిమాండ్‌ను పెంచుతుంది. గోధుమను ఎంత ఎక్కువ పండిస్తే అంత ప్రయోజనం కనుక. గోధుమ పంటకోతల సమయంలో మరింత మంది వ్యవసాయ కార్మికులు అవసరం అవుతారు కనుక. పిఎం కిసాన్‌ను కానీ, పునర్వ్యవస్థీకరించిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కానీ పరిశీలించినపుడు ఈ రెండు విధానాలు ప్రజలకు డబ్బు సంపాదించే మార్గాలే.. దీనిపై మనం చర్చించాల్సిన అవసరంవుంది. అయితే కేవలం పూర్తిగా పిఎం కిసాన్ పథకంపై ఆధారపడటం నిష్ప్రయోజనమే అవుతుంది. మద్దతు ధర విధానం వ్యవసాయ కార్మికుల మనస్సుల్లో దురభిప్రాయాన్ని ఈ పథకం గుర్తించకపోవటమే ఇందుకు కారణం. మద్దతు ధరలను పెంచుకుంటూ పోతూ ఇక ఏ మాత్రం పెంచలేని స్థితికి చేరుకున్నాం. మద్దతు ధరలపెరుగుదల రేటుపై పరిమితి విధించటం ద్వారా ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని భారీయెత్తున కట్టడి చేయగలిగింది.
కేవలం ఇది మాత్రమే అభివృద్ధిపై దృష్టి సారించటానికి సరిపోదని మీరు మీ పుస్తకంలో పేర్కొన్నారు కదా? మనం అభివృద్ధిపై దృష్టిసారించకపోతే ఉపాధి కల్పన ఎక్కడి నుండి వస్తుంది?
అదే నేను చెబుతోంది... ప్రజలెవరూ ఉపాధి లేకుండా లేరని చెప్పటం సరికాదు. 30 ఏళ్లు దాటిన వారిలో అధికసంఖ్యాకులు ఏదో ఒక రూపంలో ఉపాధి పొందుతున్నారు. మంచి ఉద్యోగాలను మీరు ఎలా సృష్టిస్తారు? ఇందుకు మీ వద్ద ఎటువంటి అద్భుత శక్తులూ లేవు కదా? ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థకు ఏం అవసరమన్న అంశంపై గీతా గోపినాధ్, రఘురామ్ రాజన్‌లు ఒక పుస్తకాన్ని రూపొందించారు. ఉపాధి కల్పన పోటీలో బంగ్లాదేశ్, వియత్నాంలు ముందుండగా మనం వెనుకబడి వున్నామన్న విషయాన్ని గుర్తించాలి. ఇందుకు అనేక కారణాలుండొచ్చు. తయారీ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటే ముందుకుగా మనం ఈ రంగంలోని వ్యక్తులను ఆకర్షించటం అవసరం. మేం ఈ సూచన చేశాం. ఇది కేవలం సూచన మాత్రమే... దీనికోసం ప్రయత్నించటం ఇప్పుడు ముఖ్యం. ఎగుమతి ప్రోత్సాహక మండలాలు (ఇపిజెడ్) ఏర్పాటు చేయటం ఇందులో ఒకటి. ఇందులో మనం కేవలం ఎగుమతులుమాత్రమే చేయం. వాస్తవానికి అవి ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసినవి. రియలెస్టేట్ రంగానికి వస్తే అక్కడ విభిన్నమైన కార్మిక చట్టాలుంటాయి. కార్మిక చట్టాలు లేకుండా మనం నిర్దిష్ట రంగాలలోకి వెళ్లానుకుంటే అది సాధ్యంకాదు. కార్మిక చట్టాలు ఒక సంస్థపై అనవసరంగా ఉద్యోగుల భారాన్ని పెట్టవు. సంస్థ ఒక ప్రత్యేక నిధి ద్వారా వారికి వేతనాలు చెల్లిస్తుంటుంది. దురదృష్టవశాత్తూ సంస్థ నష్టాల బారిన పడి ఎవరినైనా ఒక ఉద్యోగిని తొలగించాలనుకున్నపుడు, మొత్తం అందరినీ తొలగించాల్సిన అవసరం లేదు. అంటే ఉద్యోగులందరూ ఆకలితో పస్తులుండనవసరం లేదు. అనేక దేశాలు ఇందుకు ప్రత్యేక నిధిని ఉపయోగించుకుంటుంటాయి. దీనికి ఆయా సంస్థలు నిధులు సమకూరుస్తుంటాయి. వెళ్లానుకున్న వారు వెళ్లిపోయేందుకు అనుమతిస్తారు. వారి ఆదాయాన్ని ఈ ప్రత్యేక నిధి ద్వారా చెల్లిస్తారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎక్కువగా వుండే ఆటోమొబైల్ రంగంలో ఈ విధానాన్ని వర్తింపచేయవచ్చా...?
ఇప్పుడదేమీ పెద్ద కష్టం కాదు. సంస్థలు ఉద్యోగులను నియమించుకునే సమయంలోనే వారు ఈ ప్రత్యేక నిధికి కొంత సొమ్మును జమ చేస్తే, అవసరం లేని వారిని తొలగించటం పెద్ద కష్టమేమీ కాదు. వారిని తొలగించినపుడు ఈ ప్రత్యేక నిధి నుండి పరిహారం చెల్లిస్తాం. తద్వారా మీరు వారికి మరింత స్వేచ్ఛ కల్పిస్తున్నారు. అనేకదేశాలలో దీనిని అనుసరిస్తున్నారు. మనం కూడా ఈ విధానాన్ని అనుసరించవచ్చు.
భారత్ వంటి దేశంలో నియంత్రణ వ్యవస్థలపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీరెలా స్పందిస్తారు?
ప్రజలు అన్ని రకాలుగా చెబుతారు. దేనినీ అతిగా అంచనా వేసుకోకూడదు. ఏదైనా ఒక్కో చోట ఒక్కో రకంగా వుంటుంది. ఒక చోట పనిచేసేది మరోచోట పనిచేయాలన్న రూలేమీ లేదు. అందువల్ల విమర్శలకు నేనేమీ భయపడను. అంటే నేను మరింత అప్రమత్తంగా వుంటానని అర్ధం.