ఆధునికత అనగానే మనకు పాశ్చాత్య సంస్కృతికి అనుగుణంగా ఉన్న పద్ధతులని అనిపిస్తుంది. అంటే అక్కడివారి వస్త్రధారణ, భాష, అలవాట్లు వంటివాటిని అనుకరించడంగా చూస్తున్నారు. నేడు మన సమాజంలో ఈ తరం యువతకు పాత పద్ధతులు నచ్చడం లేదు. పాశ్చాత్య అందునా అమెరికా తరహా పద్ధతులను అవలంబించటాన్ని వారు ఆధునికతగా చూస్తున్నారు. పశ్చిమ దేశాలు ఇంకా సూటిగా చెప్పాలంటే ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థ ముందుకు తెచ్చిన వినిమయ సంస్కృతిని అనుసరించడాన్ని, అనుకరించడాన్నే ఆధునికత అనుకుంటున్నారు. అందుకే పాశ్చాత్యులు పాటించే మదర్స్ డే, ఫాదర్స్ డే, వాలెంటైన్స్ డే వంటివి మన దేశంలో శరవేగంగా వ్యాపిస్తున్నాయి. అసలు ఆధునికత అంటే ఏమిటి? ఆధునికం అంటే శతాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థ మీద తిరుగుబాటును లేవదీసి, కొత్త వ్యవస్థను, కొత్త జీవన విధానాన్ని ప్రవేశపెట్టడం అని భావించవచ్చు. ఇది కేవలం కాలానికి సంబంధించింది మాత్రమే కాదు. కాలం దాని పాత్రను అది నిర్వహించినప్పటికీ కాలంతోపాటు ఇతర మౌలికాంశాలు ఆధునికతను అర్థం చేసుకోవడానికి తోడ్పడతాయి. సంప్రదాయాలనూ, సాంప్రదాయకమైన విశ్వాసాలనూ, ఆచారాలనూ నిర్మమకారంగా విసర్జించి, ప్రతి సమస్యనూ ఆధునిక విజ్ఞాన శాస్త్రాల సహాయంతో, హేతువాద దృష్టితో పరిశీలించడం ఆధునికత అని ప్రముఖ సాహిత్య విమర్శకులు రాచమల్లు రామచంద్రారెడ్డి నిర్వచించారు. ఆంగ్ల సంప్రదాయాలు, సాహిత్యం చేత ప్రభావితమైందే ఆధునికత అని కొందరంటే, సమాజంలోనూ, సాహిత్యంలోనూ సమూలమైన మార్పులు తెచ్చిన పరిణామం ఆధునికం అని మరి కొందరు నిర్వచించారు. ఆధునిక విజ్ఞాన శాస్త్రాల సహాయంతో, హేతువాద దృష్టితో సమాజాన్ని అధ్యయనం చేయడం నేర్పిన కాలాన్ని ఆధునిక కాలమనీ, ఆధునిక ప్రాతిపదికగా నడుస్తున్న యుగాన్ని ఆధునిక యుగమనేది పై నిర్వచనాల సారాంశం. అంటే ఇది వర్తమాన మార్పులకు సంబంధించిందని చెప్పుకోవచ్చు. గత కాలంలో సమాజంలో కొన్ని కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఉంటాయి. ఆ మాటకొస్తే అవి ఏ కాలానికైనా ఉంటాయి. వాటితో పోలిస్తే ప్రస్తుత కాలంలో మారిన పరిస్థితుల దృష్ట్యా పాత పద్ధతులను ఉన్నవి ఉన్నట్లుగా పాటిస్తే అర్థవంతంగా ఉండక పోవడమేగాక సమాజం ముందుకు పోవటానికి ప్రతిబంధకంగా మారవచ్చు. అటువంటి వాటిలో కాలానుగుణంగా మార్పులు చేయటంగానీ లేక మొత్తానికే వాటిని విడిచి పెట్టి మరో కొత్త పద్ద్ధతిని కనుగొని దాన్ని పాటించటం గానీ చేయటం జరుగుతుంది. ఈ కొత్తగా వచ్చిన పద్ధతినే ఆధునికత అంటాము. అంటే నేటి అవసరాలకు సరిపడా కొత్త పద్ధతులు కానీ, పాతవాటిలో అవసరమైన మార్పులు చేసుకోవటం గాని ఆధునికత అవుతుంది. పాత పద్ధతులు మన అవసరాలను తీర్చలేకపోతున్నప్పుడు వాటిని అనివార్యంగా మార్చుకోవాలి. అలా కాకుండా వాటినే పట్టుకు వేలాడితే మనం గత కాలానికి బందీలుగా మారతాం. అభివృద్ధికి అంతరాయం కలిగి సమాజం పాచి పట్టటానికి, కుళ్ళిపోవటానికి దారి తీస్తుంది. అందుకే మనం చరిత్రలోని మధ్య యుగాలను అభివృద్ధి నిరోధకమైనవిగా చూస్తాం.
మనం కాలంలో ఒక విచిత్రాన్ని గమనించవచ్చు. వేషభాషల్లో, అవాట్లలో అత్యంత ఆధునికునిగా కనిపించే వాళ్లు కూడా భావాలలో పాతకాలం నాటి అభివృద్ధి నిరోధక భావజాలాన్ని కలిగి ఉంటున్నారు. ఈ విషయంలో పాత తరం వారికన్నా కొత్త తరం వారు మరింత మూఢ భావాలకు లోనవడం కనిపిస్తోంది. ఇది సమాజం మితవాద మలుపుతీసుకున్న ఫలితం. ఆధునికత అనేది ఒక స్థిరమైన విషయం కాదు. అది నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. సమాజం ముందుకు పోవటానికి, సామాజిక జీవితాన్ని ఇంకా మెరుగు పర్చటానికి అదే సమాజంలో ఉద్భవించే లేక ఇతరత్రా ఎక్కడి నుంచైనా తెచ్చుకున్న కొత్త ఆలోచనలు, పద్ధతులు అవసరమౌతాయి. ఆ ప్రక్రియ నిరంతరం నడుస్తూనే ఉంటుంది. ఈ కొత్తగా వచ్చే దాన్నే ఆధునికతగా చెబుతాము. ఒక వేళ ఉన్న పరిస్థితిని మార్చాలనుకుని అది ఇంకా దిగజారిపోయే పరిస్థితి కల్పిస్తే అది ఆధునికం కాజాలదు. అందువల్ల సమాజానికి ఆధునికత అన్ని కాలాల్లోనూ అవసరమే. అయితే అది ఎల్లప్పుడూ సమాజాన్ని ముందుకు నడిపేదిగానే ఉండాలి. అప్పుడే ఆ సమాజం గతం కంటే అభివృద్ధి చెందగలుగుతుంది. అలాగే ఆధునికత అనే పదం మనకు అనేక సందర్భాల్లో విన్పిస్తుంటుంది. ఆధునికి మానవుడు, ఆధునిక చరిత్ర, ఆధునిక సమాజం అని చెప్పుకుంటుంటాం. అంటే మునుపటి వాటికి భిన్నమైనవని, పురోగామిగా ఉన్నవని అర్థం. ఆధునికత ఓ ప్రక్రియ. దాని గమనం ఎప్పుడూ ముందుకే. సమాజాన్ని ఇంకా మెరుగైన పరిస్థితిలోకి తీసుకు వెళ్ళటమే. అంటే సామాజిక చైతన్యం నిరంతరం ఒక రకమైన అంతర్ ఘర్షణలో ఉంటూ సమాజాన్ని ఇప్పుడు ఉన్న జాడ్యాలు, లోపాల నుంచి బయట పెడుతూ పరిస్థితిని మెరుగు పరుస్తూ పోయే ప్రక్రియే ఆధునికత. అలాగే ఏ కాలానికి ఆ కాలానికే అవసరం మేరకు సమాజంలో నుండే ఉద్భవించే కొత్త భావనలు, ఆలోచనలు, పద్ధతులు ఈ ఆధునికత అనే ప్రక్రియ నిరంతరతను సూచిస్తాయి.
నేటి మన సమాజంలో మన భావజాలంలోనూ, ఆలోచనా విధానంలోనూ ఆధునికత అనేది పెరగాలి. ప్రజాతంత్రయుతంగా, లౌకికంగా ఉంటేనే ఆధునికత అనిపించుకుంటుంది. చక్కటి వేష ధారణ, భాష ఉండి ఆలోచనలు మాత్రం మధ్య యుగాల నాటివి ఉంటే అది ఆధునికత అన్పించుకోదు. ఫ్యూడల్ భావజాలాన్ని వ్యతిరేకించడం నేటి పరిస్థితుల్లో మన దేశంలో ఆధునికత. కులాచారాలను, మత మౌఢ్యాలను వ్యతిరేకించడం, మహిళలను పురుషులతో సమానంగా పరిగణించడం ఆధునికత.