నీ చర్మమెప్పుడూ
పాల నురగలానో
చేమంతులు
నూరి పూసిన
పసుపు గంధంగానో
మిళ మిళలాడుతూనే
వుండాలి
ముట్టుకుంటే
మాసిపోయే
అందంగానే
నువ్వుండాలి
నీకో అందమైన
ముద్ర పడింది
దానికింద
నీ చర్మంతో పాటు
మనసూ నలగాలి
కాలి కమురు వాసనలేయాలి
పైకి మాత్రం
చిరునవ్వుల పరిమళాలే
రువ్వాలి
నీ చుట్టూ
అందమే పొగ చూరుతూ
నువ్వో తెల్ల వజ్రంలా
మెరవాలి
ఇస్త్రీ పెట్టెతో
బట్టల ముడతల్ని
చదును చేసినట్టే
నీ వయసు ముడతల్ని
ఎప్పటికప్పుడు
శస్త్ర చికిత్సలతో
చదును చేస్తూ
నున్నగా మెరుపులీనాలి
నీవ్యక్తిత్వంతో గానీ
నీ ఆలోచనలతో గానీ
మాకస్సలు పనేలేదు
నువ్వెప్పుడూ
రంగుల బొమ్మలానే
కనిపించాలి
నువ్వు అందంగానే
బతకాలి
అందంగానే చావాలి
నీ అందం ఏమాత్రం
జారినా
ఈ సమాజం ఊరుకోదు
నిన్ను అందంగానే
చంపేస్తుంది
నీ పైన వేసిన
అందమనే ముద్ర
నిన్ను కన్నీటి గోలెంలో
పడేసి
ఊపిరాడకుండా చేస్తుంది!
- చిత్తలూరి
82474 32521
అందంగానే..
