నాన్నని చూసి పరుగుపరుగున వెళ్లి హత్తుకునే చిన్నారిలా కనిపిస్తుంది కృష్ణమ్మ పాయ. ఆ బుజ్జాయి నుదుట ముద్దిచ్చి పైకి ఎగరేసే తండ్రిలా అనిపిస్తుంది బంగాళాఖాతం. మడ అడవుల మధ్యగా సముద్రాన్ని చేరుతుంటే ఎదురొచ్చే గాలికి మనసు తేలిపోతుంటుంది. కనుచూపు మేరంతా విశాలమైన తీరం సముద్ర స్నానాన్ని కాసింత ఆలస్యం చేసి, ఆట పట్టిస్తుంది. కానీ, అలా అది అడ్డుపడకుంటే... ఆ మెత్తటి నల్లటి ఇసుక మీద బేర్ఫూట్తో అడుగులు వేస్తుంటే.. కోల్పోయిన పురాతన బంధువెవరి ఒడిలోనో బుజ్జాయిలా ఒదిగిపోయిన అనుభూతిని చాలా మిస్ అయిపోతాం. కృష్ణాజిల్లా పల్లెల అందాల మధ్యన సాగి, హంసలదీవి సాగరసంగమాన్ని చేరుకుంటే ఇలాంటి లెక్కలేనన్ని గురుతులు మిగుల్చుకోవచ్చు.
కొన్ని పర్యాటక ప్రయాణాలు అనుకోకుండా జరగాలి. అప్పటికప్పుడు అనుకుని, హడావిడిగా స్నాక్స్ మూట కట్టుకుంటేనే ఓ సుదూర ప్రయాణం కోసం ప్రాణం ఎంత తహతహలాడుతుందో తెలిసేది..! మా ప్రయాణం ఇలానే మొదలైంది. ఎప్పుడూ వెళ్లే బందరు బీచ్‌కు కాస్త దూరంగా తీరం వద్దకే ఎటైనా వెళ్లాలనిపించింది. ఉదయం 11 గంటలకు వచ్చిన ఆ ఆలోచన అప్పటికే ఆలస్యం చేసేసిందని తోచినా, చాలారోజుల నుంచి స్టాండేసిన సుదూర బైక్ రైడ్ అటుగా లాగింది. ఉన్నది.. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలంలో. ఈ మధ్యనే వేస్తోన్న హైవే మీద బందరు బీచ్ గంట దూరమే..! కానీ, ఆ ల్యాండ్స్కేప్లన్నీ బాగా పరిచయమైపోయాక ఆఫ్-బీట్ ట్రాక్ కోసం వెదికాం. పంట చేల మధ్య మెలికలు తిరిగే దారుల వెంట... ఇంకా ఇలాంటి ఇళ్లూ, గ్రామాలు మిగిలే ఉన్నాయా..? అనుకునే కట్టడాల పక్కగా సాగర సంగమానికి కదిలాం. హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు విజయవాడ నుంచి అవనిగడ్డ మార్గంలో హంసలదీవి బీచ్ రోడ్డుకు వచ్చేయొచ్చు. కేవలం 66 కిమీలే. కానీ, దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. ఆ రూటు అంతకుముందు చాలాసార్లు తిరిగేయడంతో దాన్ని దాదాపున టచ్ చేయకుండా చిన్నచిన్న గ్రామాల గుండా రూట్‌మ్యాప్ ఎంచుకున్నాం. ప్రయాణ సమయం పెరుగుతుంది కానీ, ఓ జిల్లాను దగ్గరగా చూడాలంటే ప్రధానమార్గాల నుంచి కాస్త పక్కకు తప్పుకోవాల్సిందే కదా?!
గ్రామసీమలు.. పచ్చని చేల కౌగిలింతల్లో...
కొన్ని ఊళ్లు ఇంకా పురాతన ఆలయాల శిథిలాల్ని, భవనాల్ని కలిగి ఉన్నాయి. పెంకుటిల్లు అడపాదడపా కనిపించాయి. వాటి నిర్మాణ విశేషం అంతకుముందు చూడలేదు. వంకీలు తిరిగే దారి, అక్కడక్కడా కొత్తగా రోడ్లు వేస్తున్నారు. ప్రయాణం మెల్లిగానే సాగుతున్నా సంతోషంగానే ఉంది. వాతావరణం కూడా చల్లబడటంతో ఎండ నుంచి తప్పించుకున్నట్టే..! భట్లపెనుమర్రు, పెడసనగల్లు దాటి దారిలో కూచిపూడి టచ్ చేశాం. తెలుగువారి నుంచి అందిన శాస్త్రీయ నృత్యం తొలి అడుగులు పడింది ఇక్కడే అనే విషయం గుర్తొచ్చింది. దగ్గరలోనే కళాక్షేత్రం. అక్కడికి వెళితే సమయం మించిపోతుందని ముందుకు కదిలాం. మొవ్వ వరకూ ఎక్కడా బండి ఆపలేదు. మొవ్వ నుంచి కొడాలి చేరాం. ఇక్కడి నుంచి నేరుగా మరో పర్యాటక కేంద్రం శ్రీకాకుళం, పాపవినాశనం వెళ్లొచ్చు. కానీ, చల్లపల్లి వైపుగా కదిలాం. దారి దాటాక గుర్తొచ్చింది.. ఘంటసాల బౌద్ధారామం దగ్గరలోనే..! మలుపు తీసుకుని చిన్నగ్రామాల నుంచి మళ్లీ చల్లపల్లి చేరాలి. అప్పటికే మధ్యాహ్నం అయ్యింది. హంసలదీవి బీచ్ కొంచెం ప్రమాదకరం కావడంతో సాయంత్రం త్వరగా తీరం నుంచి పంపించేస్తారు. దాని దగ్గరలోని మడఅడవులు అభయారణ్యం కూడా కావడం మరో కారణం. ఎర్రపీతలు, సముద్ర తాబేళ్లు, చేపల్ని వేటాడే అరుదైన పిల్లి, ఎక్జోటిక్ మత్స్య జాతులు, పక్షి జాతులు... ఇలా ఆ ప్రాంతం ఎకోలాజికల్ హాట్‌స్పాట్ కూడా..! అందుకే పర్యవేక్షణ ఎక్కువగానే ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ప్లాన్ చేసుకోవాలి. కానీ, సమయం కేటాయించగలిగాం.
రెండు ఊళ్లు... రెండు కాలాలు...!
ఘంటసాలలోని బౌద్ధారామం ఇటుకలతో కట్టబడింది. రకరకాల కొలతల్లో అద్భుతంగా నిర్మించిన కట్టడమిది. 1870ల్లోనే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ గ్రామ చరిత్రని గుర్తించింది. అప్పటి తవ్వకాల్లోనే దీని బౌద్ధ స్థూపం ఆనవాళ్లు బయటపడ్డాయి. తర్వాతి దశలవారి తవ్వకాల్లో 23 అడుగుల ఎత్తు, 112 అడుగుల చుట్టుకొలతతో స్థూపం వెలుగుచూసింది. మిగతా చోట్ల మహా చైత్యాల నిర్మాణశైలికి ఇది విలక్షణం, విభిన్నం. విలక్షణమైన ఇండో-రోమన్ల కాలానికే ఈ ఊరు ప్రఖ్యాతి పొందింది. స్థూపం ఎదురుగానే ఇప్పుడు మ్యూజియాన్నీ ఏర్పాటు చేశారు. దగ్గరలోని సరస్సుల నుంచి తెల్లకలువ పూలు తెచ్చి, బుద్ధునికి అర్పిస్తున్నారు. ఆ సరస్సులూ ఎంతో అందంగా ఉన్నాయి. స్థూపం ప్రాంగణంలోనే స్నాక్స్ తిని.. మళ్లీ బయలుదేరాం. కొంతసేపటిలోనే చల్లపల్లి వచ్చేసింది. ఊరి మలుపు తిరగ్గానే కోట కుడ్యాలు దూరం నుంచే కనిపిస్తుంటాయి. వాటి చుట్టుతా చిన్నపాటి కొట్లు ఉండటంతో పూర్తిగా కనిపించదు. ప్రధాన గేటు ద్వారా లోనికి బైక్ తీసుకెళ్లొచ్చు. ఎంతో చరిత్ర ఉన్న 18వ శతాబ్ది నాటి చల్లపల్లి కోట ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ప్యాలెస్ ఎదురుగా ఉన్న పాండ్‌లో నీళ్లు లేవు. దాని మధ్యన ఓ భారీ వృక్షం మొలిచింది. భవంతి లోపల సందర్శనకు అనుమతిస్తున్నారు. కోట పరిసరాల్లో ఉన్నంతసేపు పాతకాలంలోకి వెళ్లిన భావన కలుగుతుంది. నిర్వహణ మెరుగుపర్చితే పర్యాటకం పెరగొచ్చు.
మలుపు తిరిగితే... దృశ్యం మారిపోతుంది !
ఇప్పటివరకు తిరిగిన దారులకు పూర్తి భిన్నంగా ఉంటుంది అవనిగడ్డ రూట్. ఓ పక్క పిల్ల కాల్వ, దాన్ని ఆనుకుని గ్రామాలు, మరో పక్క పొలాలు. సన్నటి, చిన్నపాటి వంతెనలు దారెంట తగులుతుంటాయి. అవనిగడ్డ పెద్ద టౌన్. ఊళ్లోకి వెళ్లకుండా కోడూరు వైపు మార్గం పట్టాలి. ఇక్కడి ప్రయాణం ఉల్లాసంగా ఉంటుంది. దారికిరువైపులా పెద్ద పెద్ద చెట్లు చల్లటి గాలినిస్తాయి. హాయిగా సాగిపోతూ అనేక గ్రామాల్ని దాటేస్తాం. ఇలా 12 కి.మీ.లకు కోడూరు చేరుకుంటాం. హంసలదీవి వెళ్లే ముందు ఇక్కడ ఆగి కావాల్సిన తిండిపదార్థాలు, ఇతర ఏర్పాట్లు చేసుకుంటే మంచిది. దీన్ని దాటితే, దారిలో ఎక్కడా సరైన సౌకర్యాలుండవు. ఇక్కడ ఏటీఎం ఉంది. పెద్ద షాపులున్నాయి. ఊళ్లోని బంధువుల్ని కలిసి, హంసలదీవికి కదిలాం.
ఇక్కడ నుంచే ల్యాండ్‌స్కేప్ ఒక్కసారిగా మారిపోతుంది. చేపల చెరువులు, మడ అడవులు విశాలంగా పరుచుకుని కనిపిస్తాయి. అవి ఎత్తు చాలా తక్కువగా ఉండటంతో కనుచూపు మేరంతా పచ్చటి రగ్గు కప్పిన అనుభూతి కలుగుతుంది. మచిలీపట్నం వెళ్లే మార్గానికి కలుపుతూ వంతెన కట్టారు. అక్కడే భారీ కృష్ణమ్మ విగ్రహం ఏర్పాటుచేశారు. అదీ ఓ టూరిస్ట్ స్పాటే. వంతెనకు ఓ వైపు పైనుంచి వచ్చే ప్రవాహం, మరోవైపు మెలిక తిరిగే పాయ... దాని పక్కనే మడ అడవులు.... ఈ అరుదైన ప్రకృతి విశేషం కృష్ణాజిల్లాలో ఉందా.. అనిపిస్తుంది. ఆ పాయకు ఆనుకునే బీచ్‌కు వెళ్లే దారి ఉంటుంది. మధ్యలో కొన్ని మత్స్యకార గ్రామాలు, అక్కడక్కడా తుపాను రక్షణ భవనాలు కనిపిస్తుంటాయి. అంతకుముందు దివిసీమను కల్లోలం చేసిన తుపాను బీభత్సం మదిలో మెదులుతుంది. ఈ విషయాలు ఆలోచిస్తుండగానే మడ అడవుల లోకంలా కనిపించే పాలకాయతిప్ప తగులుతుంది.
ఆశ్చర్యానికి లోనవుతాం
కృష్ణమ్మలోని ఓ భాగం ఎదురుమొండి నుంచి మూడు పాయలుగా గుల్లలమోద, నాచుగుంట, లంకేనివాని దిబ్బ మీదుగా సముద్రంలో కలుస్తుంది. కానీ, అక్కడకి వెళ్లడం కష్టం, ప్రమాదకరం. సముద్రపు బ్యాక్‌వాటర్స్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అవనిగడ్డకు ముందే పోతురాజు బొబ్బర్లంక వద్ద మలుపు తిరిగిన కృష్ణమ్మలోని ఓ శాఖ ఆరేడు మెలికలు తిరిగి, హంసలదీవి వద్ద సముద్రంలో కలుస్తుంది. ఇక్కడ విశాలమైన బీచ్ ఉండటం, ప్రవాహ వేగం మందగించడం వంటి సానుకూలతల వల్ల సాగరసంగమం చూడటానికి వీలుంటుంది. సంగమం నుంచి వెనక్కుతన్నే నీరు ఇక్కడో చిన్నపాటి నీటిపాయల్ని తయారుచేసింది. అలాంటిది ఒకటి చెక్‌పోస్ట్ దాటగానే మనకు ఎదురుపడుతుంది. అక్కడే పల్లెకారుల బోట్లు లంగర్ వేసి ఉంటాయి. ఇదివరకు ఇక్కడి నుంచి బోటులో సాగరసంగమం తీసుకెళ్లేవారట..! కొన్ని ప్రమాదాల వల్ల ప్రస్తుతం టూరిస్ట్ బోటింగ్‌కు అనుమతి లేదు. అక్కడి నుంచే మడ అడవుల అందాల్ని చూస్తూ అరగంటకు పైనే గడిపేశాం. తర్వాత విశాలమైన తీరాన్ని చేరుకున్నాం. ఇసుక, మట్టి నల్లగా ఉండటం ఓ విశేషం. హంసలదీవి బీచ్‌లోనే సముద్ర స్నానానికి అనుమతిస్తారు. ఇక్కడా ప్రమాదాలెక్కువే. ఆటుపోటులు, మృత్తిక లక్షణం వల్లో ఎక్కడ గుంటలు ఏర్పడతాయో..! ఎక్కడ దిబ్బలు తగులుతాయో తెలీదు. నిరంతరం బీచ్గార్డుల నిఘా ఉంటుంది. మేముండగానే ఇద్దరిని కాపాడారు. సరిగ్గా సాయంత్రం నాలుగున్నరకు అక్కడకు చేరుకున్నాం. బీచ్ చూడగానే ఎంతో సంతోషం కలిగింది. చకచకా సముద్రస్నానాకి సిద్ధమైపోయాం. అన్నేసి గంటల ప్రయాణ బడలికను ఒక్క అల చెదరగొట్టింది. గంటకు పైగానే సముద్రంలో సేద తీరాం. అప్పటికే సాయంత్రం కావడంతో కోడూరులోనే బంధువుల ఇంట్లో ఉండి, తర్వాతి రోజూ ఉదయం సాగర సంగమానికి వెళ్లాలనుకున్నాం.
తర్వాతి రోజు ఉదయం మళ్లీ కృష్ణమ్మ విగ్రహానికి హారు చెప్పి మడ అడవుల అందాల్ని గుండెల నిండా నింపుకుంటూ సాగర సంగమం చేరాం. ఎక్కువగా వారాంతాల్లో సందర్శకులు వస్తుంటారు. మేం అదే సమయంలో వెళ్లాం. సంగమం వద్ద చాలాసేపు గడిపాం. అయిష్టంగానే తిరుగు ప్రయాణంలో కృష్ణమ్మ విగ్రహానికి బై చెబుతూ వంతెన దాటి, మచిలీపట్నం మార్గం పట్టాం. ఇక్కడి గ్రామాలు మరీ విశేషం. తాటిచెట్లని కాల్వకు అడ్డుగా వేసుకుని, దారి చేసుకున్నారు. ఇరుకు రోడ్లు ఎక్కువ. చీకటి పడేలోగా మచిలీపట్నం చేరుకుని, అక్కడి నుంచి అలవాటున్న హైవే మీదుగా మళ్లీ మా ఊరు చేరాం.
సాగర సంగమాన్ని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తీరాల్లో సేదతీరడం, నదుల వెంట సాగడం ఒక అనుభూతి అయితే... ఓ నది తన పుట్టుకకు కారణమైన సముద్రంలో కలుస్తున్న ప్రదేశంలో ఉండటం ఎంతో గొప్ప గురుతుల్ని మిగులుస్తుంది...! అదంతా ఊహలా అనిపిస్తుంది. కలలో ఉన్నామనిపిస్తుంది. ఎంత అరుదైన అనుభూతి అది..!
- అజయ్‌కుమార్ వారాల
9502395077