నేటి యువత ఆలోచనల్లో అనేక మార్పులు వచ్చాయి. గతంలో వలే నలుగురు నడిచిన దారిలోనే నడవాలని లేదు. ఃమాకు నచ్చిందే చేస్తాం.. ఎవరికోసమో మా ఆలోచనలను మార్చుకోం అర్థమైందా డ్యూడ్..! అంటున్నారు. ఈ మధ్య ఇన్స్టిట్యూట్లో చదువు పూర్తిచేసుకున్న విద్యార్థులపై ముంబైకి చెందిన ఐఐటీ బీ న్యూస్ పేపర్ నిర్వహించిన సర్వేలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. నేటి యువతలో 39 శాతం మంది మాత్రమే దేవుణ్ని నమ్ముతామనీ, 60 శాతం మంది దేవుణ్నికాని, ఇతర శక్తులను కానీ నమ్మమని చెబుతున్నారు. యువతలో వచ్చిన మార్పుకు నిదర్శనమే ఈ సర్వే. ఇందులో వెలుగుచూసిన మరెన్నో విషయాలు తెలుసుకుందాం పదండి..
పసితనంలో పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతల సంరక్షణలోనే ఉంటారు. గోరుముద్దలు తినే వయస్సు నుంచే తల్లిదండ్రులు దేవుడున్నాడని.. ఆయన మనం చేసే మంచి చెడులను చూస్తూ ఉంటాడని నమ్మబలుకుతుంటారు. వారు చెప్పే ప్రతిమాట పిల్లల మనస్సుల్లో నాటుకుపోతుంది. అంతెందుకు... వర్షం వస్తే పై నుంచి దేవుడు కురిపిస్తున్నాడనే చిన్నప్పుడు విని పెరిగిన వారే వీరంతా. కానీ ఈ మధ్య ఐఐటీ బీ న్యూస్ పేపర్ నిర్వహించిన సర్వేలో యువత నుంచి ఎవరూ ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 60 శాతం మంది దేవుణ్ణి నమ్మడం లేదని చెప్పడం ఆ సర్వే నిర్వహకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిని బట్టే అర్థమవుతోంది. యువత ఒకప్పటిలా లేరు తమకంటూ ఒక దారిని ఎంచుకుంటున్నారని. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 70 శాతం మంది బీటెక్ స్టూడెంట్లు, కేవలం 33.75 శాతం మంది మాత్రమే ఇతర డిగ్రీలు చేసినవారు. ఒకప్పుడు కాలేజీకి డుమ్మా కొట్టాలంటేనే యువత భయపడేవారు. కానీ నేడు ఆ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. కేవలం 40 శాతం మంది కాలేజీలో అన్ని క్లాసులకు, 32.5 శాతం మంది కొన్ని ముఖ్య క్లాసులకు, 7.5 శాతం మంది అన్ని క్లాసులకు హాజరవుతున్నారు. ఇంకొక విషయం వింటే మరీ ఆశ్చర్యపోతాం! అందేంటో తెలుసా? చదువంతా అయిపోయినా ఇప్పటికీ సెంట్రల్ లైబ్రరీ ముఖం చూడని విద్యార్థులు 16.2 శాతం ఉన్నారట!
క్లారిటీ ఉంది
హాస్టల్ అంటేనే సమ వయస్కులు చాలామంది ఉంటారు. ఒక్కసారి ఆ లైఫ్‌కు అలవాటు పడినవారు స్నేహితులతోనే గడపడానికి ఇష్టపడతారట! ముఖ్యంగా ఐఐటీయన్లు. చదువు ముగిసిన తర్వాతా వీరిలో 40 శాతం మంది మిత్రులతో కలిసి ఉండటానికీ, 27 శాతం మంది ఇంటికెళ్లడానికి, 19 శాతం మంది ఒంటరిగా గడపడానికి ఇష్టపడుతున్నారు. హాస్టల్లో ఉన్న వారిలో 66 శాతం మంది బంధాలు, బంధుత్వాలకు విలువనిస్తూ తల్లిదండ్రులకు టచ్‌లోనే ఉంటున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే నేటి యువతలో పెళ్లిపై క్లారిటీ ఉంది. చదువు అయిన తర్వాత మరో ఐదేళ్ల వరకు పెళ్లి ప్రస్తావనే ఎత్తేది లేదంటూ 39.15 శాతం, అప్పుడే చెప్పలేం అని 31 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్లలో వివాహం చేసుకుంటామని 21.4 శాతం మంది తమ అభిప్రాయాలను చెబుతున్నారు. పూర్తిగా చదువులో నిమగమైన యువత ప్రతి పదిమందిలో ఆరుగురు విద్యార్థులు రెండు, మూడు రోజులకొకసారి మాత్రమే స్నానం చేస్తున్నారని తెలుస్తుంది. ఇది మాత్రం టూ బ్యాడ్ కదా!
ఈ సర్వే ప్రకారం యువతలో వచ్చిన మార్పులు మరో నవతరానికి నాంది పలుకుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
హేతువాద దృష్టితోనే 60 శాతం యువత
