అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటేనే ఆరోగ్యం. లేకపోతే ఏదో ఒక రూపంలో అనారోగ్యం బయటపడుతుంది. ముఖ్యంగా శరీరంలో మెగ్నీషియం తగ్గితే చాలా ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో జరిగే 300 రకాల రసాయనిక చర్యల్లో దీనిపాత్ర ఉంటుంది. గుండె కొట్టుకోవడం నుండి కండరాలు, హార్మోన్ల పనితీరు వరకు మెగ్నీషియం పాత్ర ఉంటుంది.
మెగ్నీషియం తగ్గితే తలెత్తే సమస్యల్లో ముఖ్యమైనవి ఆకలి లేకపోవడం, తలతిరుగుడు, ఒత్తిడి, తిమ్మిర్లు, ఒళ్లు మొద్దుబారడం, నొప్పులు మొదలైపవి. ఈ సమస్యలు కనిపించినా చాలాసార్లు దాన్ని వైద్యులు మెగ్నీషియం కొరతగా గుర్తించలేరు. అప్పుడు చికిత్స వేరుగా ఉంటుంది. మంచి ఆహారం ద్వారా శరీరానికి మెగ్నీషియం అందించడం తేలికే కానీ, మనం చేతులారా కొన్ని అలవాట్ల వలన మెగ్నీషియం లోపాన్ని కొనితెచ్చుకుంటున్నాం.
మితిమీరిన మోతాదులో కాఫీ, ఆల్కహాల్, సోడా తీసుకోవడం వలన శరీరానికి తగిన స్థాయిలో మెగ్నీషియం అందదు. అలాగే కూల్డ్రింకులు ఎక్కువగా తాగే అలవాటున్నా ఇదే పరిస్ధితి తలెత్తుతుంది. ఈ విషయాలను ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నపుడు శరీరం విటమిన్ డిని శోషించుకోలేదు. విటమిన్ డి లేకపోతే శరీరం మెగ్నీషియంను ఎక్కువగా తీసుకోలేదు. తీపి పదార్థాలను అతిగా తీసుకున్నా కిడ్నీల ద్వారా మెగ్నీషియం బయటకు పోతుంది. అయితే ఈ కొరతని పూడ్చుకోవడానికి సప్లిమెంట్లు తీసుకోవచ్చు కానీ, అవి ఎక్కువైతే గుండెకు ప్రమాదం. అందుకే డాక్టర్ సలహా ప్రకారమే సప్లిమెంట్లు వాడాలి.
ఆకుకూరలు, గింజలు, తృణ ధాన్యాలు, నట్స్, చేపలు, పెరుగు, అరటిపళ్లు, డార్క్ చాక్లెట్ మొదలైన పదార్థాల్లో మనకు మెగ్నీషియం ఎక్కువగా లభిస్తుంది.
మెగ్నీషియం మాయ!
