- 'నవ తెలంగాణ' పుస్తక ప్రదర్శనలో కలెక్టర్ రాహుల్ బొజ్జా
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
పిల్లలకు చదువుపై ఆసక్తి పెంచేలా తల్లిదండ్రులు, గురువులు చూడాలని హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా సూచించారు. హైదరాబాద్‌లోని నవతెలంగాణ పుస్తకాలయంలో బుధవారం బాలల పుస్తక ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సాహిత్యం చదవటమనే అభిరుచి తగ్గుతున్న సందర్భంలో ఇలాంటి పుస్తక ప్రదర్శనలు ఉపయోగపడతాయని అన్నారు. పుస్తకాలు చదవటం వల్లనే పిల్లల్లో భావ సంఘర్షణ జరిగి ఆలోచనలకు పదును పెట్టేందుకు ఉపయోగపడుతుందన్నారు. పిల్లలను క్లాసు పుస్తకాలకే పరిమితం చేయకుండా విస్తృత జ్ఞానాన్ని రాబట్టుకునేందుకు, వివిధ రకాల పుస్తకాలు చదవటాన్ని ఒక అభిరుచిగా మార్చాలని అన్నారు. హైదరాబాద్ బుక్‌ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ కావాలంటే ముందు జ్ఞాన తెలంగాణగా మార్చాలని అన్నారు. ఈ సందర్భంగా 'మన సీతాకోక చిలుకలు' మరియు 'ఆవరణం' అనే రెండు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ పుస్తక ప్రదర్శన పంద్రాగస్టు వరకు కొనసాగుతుందని, పిల్లలకు 20 శాతం తగ్గింపుతో వివిధ పబ్లిషర్స్ పుస్తకాలు అందుబాటులో వుంటాయని నవ తెలంగాణ ప్రచురణాలయం జనరల్ మేనేజర్ కె.చంద్రమోహన్ తెలిపారు. కార్యక్రమంలో గీతాంజలి మరియు శ్రీ చైతన్య పాఠశాలల విద్యార్ధులు, బ్రాంచ్ ఇన్‌ఛార్జి సురేష్, కృష్ణారెడ్డి, ఖయ్యూం, ధనలకిë, సంగీత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
పిల్లల్లో చదువుపై ఆసక్తి పెంచాలి
