ప్రజాశక్తి - కల్చరల్
తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీనాథయుగం వంటిదే సినారె సినీ గీత యుగంగా పేర్కొనవచ్చని ప్రముఖ సాహితీవేత్త ఆచార్య టి. గౌరిశంకర్ అన్నారు. వంశీ విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో శ్రీత్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళావేదికపై ప్రఖ్యాత కవి డా. సి. నారాయణ రెడ్డి జన్మదిన సందర్భంగా సినారె సాహితీ ప్రభావం ప్రసంగ పరంపర బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు ప్రసంగంలో ఆచార్య గౌరిశంకర్ సినారె చలనచిత్ర గీతాలు అంశంపై మాట్లాడారు. సినీ పాటకు కావ్య సౌందర్యాన్ని కొత్త పలుకబడులను, జానపద మాధూర్యాన్ని సంతరింప చేసినవారు సినారె అన్నారు. చిన్ననాడే గ్రామీణ వాతావరణంలోని విధిభాగవతాలు, గొల్ల సుద్దులు, పల్లె పదాలు, హరికథలు, బుర్రకథలు ఆయనను విశేషాంగా ప్రభావితం చేశామని అన్నారు. గులేబకావళి కథ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన సినారె దాదాపు 3,500 సినిమా పాటలను రాసి తెలుగు ప్రజానీకాన్ని ఆకట్టుకున్నారన్నారు. నిరాక్షరాస్యుల సైతం సినారె పాటలు నాలుకలపై నాట్యం చేస్తాయని వివరించారు. 'పాట నా వంట పుట్టిందే అని వెంటపడి తెచ్చుకున్నది కాదు' అన్న సినారె మాటలో వాస్తవం ఉందన్నారు. కార్యక్రమంలో డా. సినారె పాల్గొనగా తెలుగు విశ్వవిద్యాలయం ప్రజా సంబధాల అధికారి డా. చెన్నయ్య స్వాగతం పలికారు. వంశీ రామారాజు అధ్యక్షత వహించగా డా. తెన్నేటి సుధా, గానసభ అధ్యక్షులు కళాదీక్షితులు పాల్గొన్నారు.
సినారె సినీ గీత యుగం
