- నీటి కొరత లేదంటున్న ఆర్డబ్ల్యుఎస్ అధికారులు
- మూలనపడ్డ బోర్లు, రక్షిత మంచినీటి పథకాలు
- విశాఖ రూరల్లో తీవ్ర ఇబ్బందులు
- బిందెడు నీరూ కరువే..
వేసవి ఆరంభంలోనే విశాఖ జిల్లాలో తాగునీటి ముంపు తరుముకొస్తోంది. భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో రోజురోజుకు నీటి సమస్య జఠిలమవుతోంది. మైదాన, ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కుళాయిలు, బోర్లు మరమ్మతులకు నోచుకోకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో మరమ్మతుల చేయలేని పరిస్థితి. తాగునీటి సమస్య ఎక్కడా లేదని, మంచినీటి పథకాలన్నీ పని చేస్తున్నాయని గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులు చెబుతున్న మాటలకు, గ్రామాల్లో వాస్తవ పరిస్థితికి పొంతనలేదు.
ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి, మునగపాక విలేకరి:
విశాఖ జిల్లాలోని 39 మండలాల పరిధిలోని 925 పంచాయతీల్లో 5,602 గ్రామాలున్నాయి. 23,19,470 మంది జనాభా తాగునీటి అవసరాలను తీర్చేందుకు 20,193 చేతిపంపులు, 3,647 సింగిల్ విలేజ్ స్కీం(ఎస్విఎస్)లు, 39 మల్టీ విలేజ్ స్కీం (ఎంవిఎస్)లు ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ పనిచేస్తున్నాయని, తాగునీటి కోరతలేదని ఆర్డబ్ల్యుస్ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రజాశక్తి పరిశీలనలో అత్యధిక సంఖ్యలో బోర్లు, మంచినీటి పథకాలు మరమ్మతులకు గురై ప్రజలు తాగునీటికి ఇబ్బందులుపడుతున్న వాస్తవం బయటపడింది.
జిల్లాలోని మునగపాక మండలం వాడ్రాపల్లిలోని శెట్టిబలిజ వీధిలో మూడు వీధి కుళాయిలున్నాయి. ఇవి ఆరు నెలలుగా పనిచేయడం లేదు. పక్కవీధిలో నీరు పట్టుకోవడానికి వెళితే ఆ వీధిలోని వారంతా నీరుపట్టుకొని, తరువాత శెట్టిబలిజ కుటుంబాలకు అవకాశమిచ్చేలోపు కుళాయిలు ఆగిపోతున్నాయి. వీధి కుళాయిలు పనిచేసినప్పుడు రోజుకు నాలుగైదు బిందెల నీరుపట్టుకొనే వీరంతా ఇప్పుడు బిందెడు నీటి కోసం కటకటలాడుతున్నారు. వాడ్రాపల్లి ఆవ సందర్శకుల కోసం గంగాలమ్మ గుడి దగ్గర ఏర్పాటు చేసిన చేతిబోరు రెండు నెలలుగా పనిచేయడం లేదు. నాగవరం పంచాయతీలోని మల్లవరంలో ఉన్న మూడు చేతిబోర్లు పాడైపోయాయి. మినీ రక్షిత మంచినీటి ట్యాంకు నుంచి నీరు సరిగా రావడం లేదు. పాల కేంద్రం దగ్గర ఉన్న కుళాయి నుంచి నీరు రావడం లేదు. దీంతో ఇక్కడి వారంతా అరకిలో మీటరు దూరంలోని అప్పికొండవానిపాలెం వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. మునగపాక పంచాయతీలోని మంగళవరపుపేటలో ఉన్న కుళాయి నుంచి నీటితో పాటు పీచు రావడంతో అనేక మంది సమీపంలోని మునగపాక నుంచి వాటర్ క్యాన్లు కొని తెచ్చుకుంటున్నారు. తాగునీటి సమస్య మునగపాక మండలానికి పరిమితం కాలేదు. మైదాన, ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలోనూ తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గతేడాది క్రాస్ ప్రోగ్రామ్ కింద రూ.25 లక్షలు మరమ్మతులకు ఖర్చుచేస్తే పైసా విడుదల చేయలేదు. ఎంవిఎస్ స్కీమ్ల నిర్వహణకు గతేడాది రూ.15 కోట్లకు ప్రతిపాదనలు తయారుచేస్తే వీటి నిర్వహణను చూడాల్సిన జిల్లా పరిషత్ రూ.3 కోట్లు విడుదల చేసింది. ఎస్విఎస్ స్కీమ్ల నిర్వహణను ప్రభుత్వం పంచాయతీలకు అప్పగించింది. మరమ్మతులకు డబ్బుల్లేవని పంచాయతీలు చేతులెత్తేయడంతో చివరకు ప్రజలు తాగునీటికి కటకటలాడుతున్నారు.
సవ్వటి నీరు తాగుతున్నాం
సిమ్మాది రప్పన్న వీధిలో కుళాయిల్లేవు. 20 కుటుంబాల వాళ్లున్నాం. కుళాయిలేక పోవడంతో అర కిలోమీటర్ దూరంలోని పెతకంశెట్టివారి వీధికి వెళ్తున్నాం. వారు నీరు ఇవ్వకపోతే సవ్వటి బోరు నీరు తాగుతున్నాం. శెట్టి బలిజవీధిలోని కుళాయిలు బాగుచేయాలని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా బాగుచేయలేదు.
- ఆళ్ల సన్యాసమ్మ, వాడ్రాపల్లి, మునగపాక మండలం