ప్రజాశక్తి-ఆగిరిపల్లి
అప్పులతో జిల్లాలోని ఆరుగురు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రోజురోజుకూ ఆత్మహత్యలు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఈ ఏడాది జూన్ నుంచి ఈనెల రెండో తేదీ వరకూ ఆరుగురు కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామానికి చెందిన తెల్లగొర్రెల వెంకటేశ్వర్లు (65), కోడూరు మండలం పోటుమీద గ్రామానికి చెందిన కడవకొల్లు వెంకటరమణ (30), చల్లపల్లి మండలం ఆముదాల్లంక గ్రామానికి చెందిన నాగిడి శ్రీను (27), నందిగామ మండలం హనుమంతులపాలెం గ్రామానికి చెందిన కత్తుల అశోక్ కుమార్ (25), మొవ్వ మండలం పెడసనగల్లు గ్రామానికి చెందిన కొనకళ్ల విజరుకుమార్ (52) ఆత్మహత్య చేసుకున్న వారిలో ఉన్నారు. తాజాగా శుక్రవారంనాడు అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆగిరిపల్లి మండల పరిధిలోని అమ్మవారిగూడెం గ్రామానికి చెందిన జలసూత్రం నరసింహారావు (45) చొప్పరమెట్ల గ్రామంలోని టేకు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య రమాదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమ్మవారిగూడెంకు చెందిన జలసూత్రం నరసింహారావుకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. జలసూత్రం నరసింహారావు తనకున్న మూడున్నర ఎకరాల పొలంతోపాటు మరో రెండెకరాల పొలం కౌలుకు తీసుకొని జీవనం సాగిస్తుంటాడు. అప్పులు, కుటుంబ ఖర్చుల నిమిత్తం చేసిన అప్పుల వల్ల కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవు తున్నాడు. గురువారం సాయంత్రం మృతుడి భార్య రమాదేవికి మృతుడు నరసింహారావు హైదరాబాదులో ఉంటున్న తన పెద్ద కుమారుడి వద్దకు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. శుక్రవారం ఉదయం చొప్పరమెట్ల గ్రామంలోని ఒక పంట పొలంలో ఉన్న టేకు చెట్టుకు ఉరి వేసుకుని ఉండటాన్ని నరసింహారావు సోదరుడు శ్రీనివాసరావు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని నూజివీడు డిఎస్పీ శ్రీనివాస్, జంక్షన్ సిఐ రమణ, ఎస్ఐ పి.కిషోర్, తహశీల్దారు వివి.భరత్ రెడ్డి పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
ఆగని కౌలు రైతుల ఆత్మహత్యలు
