- మృతదేహంతో కార్మికుల ఆందోళన
- నగరపంచాయతీ ఎదుట ఉద్రిక్తత
ప్రజాశక్తి - హైదరాబాద్
కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్యకు కారకుడైన నగరపంచాయతీ కమిషనర్ జి.మల్లికార్జునస్వామిని సస్పెండ్ చేయాలని కాంట్రాక్టు కార్మికులు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట నగరపంచాయతీ కార్యాలయం ఎదుట జెట్టి శ్రీనివాస్ మృతదేహంతో బుధవారం ఆందోళన నిర్వహించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. విధులు సక్రమంగా నిర్వర్తించట్లేదని ఆరోపిస్తూ శ్రీనివాస్‌ను విధులనుంచి తప్పించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని యూనియన్ నాయకులు, కుటుంబసభ్యులు ఆవేదన చెందారు. తక్షణమే కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళనకు సీపీఐ(ఎం), సీపీఐ, కాంగ్రెస్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎంఆర్పీఎస్, మాల మహానాడు తదితర ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. మృతుడి కుటుంబానికి నష్టపరిహారం, ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ డివిజన్ కార్యదర్శి యువరాజు డిమాండ్ చేశారు. సీఐ ఏజె దివాకర్ ఆందోళనకారుల వద్దకొచ్చి సర్ది చెప్పేందుకు యత్నించగా వాగ్వివాదం నెలకొన్నది. నగరపంచాయతీ చైర్మన్ రామచంద్రయ్య, పలువురు టీఆర్ఎస్ నాయకులు ఆందోళనకారులతో చర్చించారు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తామని, ప్రభుత్వం నుంచి వచ్చే సౌకర్యాలు వర్తింపజేస్తామని హామీనివ్వడంతో ఆందోళన విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.