కొందరు భోజనం చేస్తున్నప్పుడు, కొందరు భోజనం చేసిన తరువాత ఎక్కిళ్లతో బాధపడతారు. అసలు ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి? మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు మన శరీరంలో గాలితిత్తిలా పనిచేసే ఒక 'డయాఫ్రమ్' ఉంది. ఇది హృదయాన్ని, పొత్తికడుపును వేరు చేసే సన్ననిపొర. వేగంగా తినడం వల్ల గానీ, తినేటప్పుడు ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసల వేగంలో తేడా రావడం వలనగానీ ఈ పొరను నియంత్రించే నరాలు స్పందిస్తాయి.దీంతో, ఈ డయాఫ్రమ్ అప్రయత్నంగా సంకోచిస్తుంది. ఇలా సంకోచించినపుడు గాలి లోపలికి పీల్చుకునేటప్పుడు కంఠనాళాలు మూసుకుపోయి 'హిక్, హిక్' అనే శబ్దం వస్తుంది. అందుకే ఎక్కిళ్లను ఆంగ్లంలో 'హికప్స్' అంటారు. కొందరు ఎక్కిళ్లు వచ్చినప్పుడు గబగబా నీళ్లు తాగుతారు. ఈ ప్రక్రియ వల్ల శ్వాస తీసుకునే వేగంలో తిరిగి మార్పు రావడం వల్ల ఎక్కిళ్లు ఆగవచ్చు. నిజానికి రక్తంలో ఆ సమయంలో ప్రవహించే ఆక్సిజన్ కొంత తగ్గి, కార్బన్డయాక్సైడ్ అతికొద్ది సేపు ప్రవహించగలిగితే ఎక్కిళ్లు నిలిచిపోతాయి. ఎక్కిళ్లకు మంచి చెడులకు సంబంధం లేదు.
ఎక్కిళ్లు ఎందుకొస్తాయి?
