హైదరాబాద్ : ప్రముఖ హీరో డాక్టర్ రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. బుధవారం వేకువజామున రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. రామెజీఫిల్మ్ సిటీ నుంచి తన కారులో ఇంటికి వస్తుండగా కారు టైరు పగిలి డివైడర్ను ఢీకొని, కారు పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో రాజశేఖర్ స్వల్పగాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఈ ప్రమాదంపై అనేక వార్తలు వస్తున్న తరుణంలో రాజశేఖర్ మీడియా ముందుకు వచ్చారు.
దేవుడి దయ వల్ల పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని ఆయన తెలిపారు. కారు పల్టీలు కొట్టడంతో ఒళ్లు నొప్పులున్నాయి తప్పా పెద్ద గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న వారితో పాటు తనపై ప్రేమాభిమానాలు కురిపించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.