- జిఒ 2430తో పత్రిక స్వేచ్ఛకు భంగం
- సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి
ప్రజాశక్తి - కర్నూలు జిల్లాపరిషత్
మీడియాపై నియంత్రణ ప్రజాస్వామ్యానికి ముప్పు అని సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీడియాను నియంత్రించేందుకు జిఒ 2430 ఇవ్వడం సరైంది కాదని తెలిపారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించే జిఒ 2430ను రద్దు చేయాలని శుక్రవారం కర్నూలు ఎంపిపి హాలులో ఎపిడబ్ల్యుజెఎఫ్ ఆధ్వర్యంలో ఇష్టాగోష్టి నిర్వహించారు. రవి మాట్లాడుతూ.. మీడియా పాలకుల ఉచ్చులో పడకుండా జాగరూకతతో ఉండాలన్నారు. సామాన్యులకు భావ ప్రకటనా స్వేచ్ఛను ఇవ్వడం లేదని, ఇక మీడియాపై కూడా ఆంక్షలకు దిగజారుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ కూడా కొన్ని పత్రికలనే లక్ష్యంగా చేసుకుని బహిరంగ సభల్లో మాట్లాడడం సబబు కాదన్నారు. పత్రిక స్వేచ్ఛను అణగదొక్కే జిఒలను ఇస్తున్నంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రద్దు చేసే దాకా పోరాడాలని తెలిపారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే మీడియా కూడా ప్రభుత్వానికి ప్రతిపక్షమే అన్నారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశారు మాట్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పత్రికలు రాస్తే... స్వీకరించి పరిష్కరించే ప్రయత్నం చేయాలని తెలిపారు. ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. ఎఐటియుసి జిల్లా కార్యదర్శి ఎస్.మునెప్ప మాట్లాడుతూ... అధికారంలోకి రాకముందు ఒక తీరు, అధికారంలోకి వచ్చాక మరో తీరుగా మీడియాపై వ్యవహరించడం సరికాదన్నారు. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఆనంద్‌బాబు, సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు జంధ్యాల రఘుబాబు, జిల్లా కార్యదర్శి కెంగార మోహన్,రజక సంఘం నాయకులు గురుశేఖర్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు శేషఫణి, మహిళా సంఘం నాయకులు శకుంతల, రచయిత రంగస్వామి, మానవతా సంస్థ ప్రతినిధి మనోహర్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాసగౌడు, గుంపుల వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఎపిడబ్ల్యుజెఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గోరంట్లప్ప, ఆర్గనైజింగ్ కార్యదర్శి చిన్న రామాంజనేయులు అధ్యక్షత వహించారు. ఎపిడబ్ల్యుజెఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.మద్దులేటి, నగర అధ్యక్షులు డి.మౌలాలి, కోశాధికారి పి.యూసుఫ్ ఖాన్ పాల్గొన్నారు.
మీడియాపై నియంత్రణ ప్రజాస్వామ్యానికి ముప్పు
