* నేటి నుండి అమలు
* జనవరి 1 నుంచి నూతన బార్ల విధానం
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:
మద్యం ధరలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. దేశీవాళీ, విదేశీ మద్యంతో పాటు, బీరు రేట్లు కూడా శనివారం ఉదయం నుండి పెరగనున్నాయి. దీంతో పాటు రాష్ట్రంలోని బార్ల విధానంలో కూడా మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతమున్న బార్ల లైసెన్సులను డిసెంబర్ 31వ తేదితో రద్దు చేసింది. జనవరి ఒకటవ తేది నుండి కొత్త లైసెన్సులు పొందాల్సివస్తుంది. దీనికోసం పెద్దమొత్తంలో దరఖాస్తు, లైసెన్స్ ఫీజులను నిర్ణయించింది. అదే సమయంలో ప్రస్తుతమున్న బార్ల సంఖ్యను 40శాతం తగ్గిస్తామని తెలిపింది. ఈ మేరకు మూడు వేర్వేరు జిఓలను ప్రభుత్వం విడుదల చేసింది. దశలవారీగా మద్య నిషేదాన్ని అమలు చేస్తామన్న హామీ అమలులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నటు ప్రభుత్వం తెలిపింది.
ధరలు ఇలా ...
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఓ ప్రకారం నూతన దేశవాళీ మద్యం ప్రస్తుతమున్న ధరలకు అదనంగా 90 ఎంఎల్‌కు రూ.30, 180 ఎంఎల్‌కు రూ.60, 375 ఎంఎల్‌కు రూ.120, 750 ఎంఎల్‌కు రూ.240, 1000 ఎంఎల్‌కు రూ.300, 2000 ఎంఎల్‌కు రూ.750 చొప్పున పెరిగింది. విదేశీ మద్యం 60ఎంఎల్‌కు రూ.30, 200-275 ఎంఎల్‌కు రూ.60, 330 నుండి 550 ఎంఎల్ వరకూ రూ.120, 700 నుండి 750 ఎంఎల్ వరకూ రూ.240, 1500 నుండి 2000 ఎంఎల్ వరకూ రూ.750 చొప్పున అదనంగా పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బీరు ధర 330ఎంఎల్ నుండి 500 ఎంఎల్ వరకూ రూ.30, 650 ఎంఎల్‌కు రూ.60 అదనంగా పెరుగుతంది. 30000ఎంఎల్ బీర్ క్యాన్‌కు రూ.3000, 50000ఎంఎల్ బీర్ క్యాన్‌కు రూ.6000 చొప్పున అదనంగా ధర పెంచారు.
ఇదీ బార్ల విధానం ...
ఇప్పటికే రాష్ట్రంలో వైన్‌షాపుల సంఖ్యను 4380 నుండి 3500కు తగ్గించామని, అదే పద్దతిలో బార్ల సంఖ్యనూ తగ్గిస్తామని తాజాగా జారీ చేసిన జిఓలో ప్రభుత్వం పేర్కొంది. అయితే, మూడు నక్షత్రాలు, ఆ పైస్థాయి కలిగిన హోటళ్లలో ఉన్న బేవరేజెస్‌కు మాత్రం ఈ కుదింపు నిర్ణయం నుండి మినహాయింపు ఇచ్చింది, బార్ల నూతన లైసెన్సులు 2020 జనవరి ఒకటోతేదీ నుండి 2021 డిసెంబర్ 31 వరకూ రెండేళ్ల కాలపరిమితికి ఇవ్వనున్నారు. దీనికోసం ఎక్సైజ్ కమిషనర్ నూతనంగా నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. బార్ల కోసం దరఖాస్తు చేసే సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది తిరిగి ఇవ్వరు. అలాగే అద్దె భవనం అయితే యజమాని అనుమతిపత్రం, దరఖాస్తుదారుడి ఆధార్‌కార్డు సమర్పించాల్సి ఉంటుంది. బార్ ఏర్పాటు కోసం నోటిఫై చేసిన ప్రాంతంలో ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. అనుమతి పొందిన తరువాత యజమాని అవసరాన్ని బట్టి బార్ స్థలాన్ని మార్చుకునే అవకాశాన్ని కల్పించారు. స్టార్ హోటళ్లలో ఉన్న బేవరేజస్ అనుమతులన్నీ రద్దు చేశారు. వారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బార్లకు సంబంధించి 50 వేల జనాభాకు మించని నగరాల్లో రూ.20 లక్షలు రిజిస్ట్రేషన్ ఛార్జి, ఐదు లక్షలు లైసెన్సు మొత్తం రూ.25 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 50 వేల నుండి ఐదు లక్షలమంది జనాభా ఉన్న నగరాల్లో అయితే రిజిస్ట్రేషన్ కింద రూ.45 లక్షలు లైసెన్సు ఫీజు ఐదు లక్షలు మొత్తం రూ.50 లక్షలు చెల్లించాలి. ఐదు లక్షల జనాభా పైబడి నగరాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జి రూ.70 లక్షలు, లైసెన్సు ఐదు లక్షలు రూ.75 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. త్రీస్టార్ అంతకుమించిన హోటళ్లలో అనుమతి కోసం దరఖాస్తు కింద రూ.1.45 కోట్లు, లైసెన్సు ఫీజు కలిపి రూ.1.50 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సుప్రీం కోర్టు నిబంధనలకు లోబడి జాతీయ రహదారుల పక్కన మద్యం అమ్మకాలు జరపకూడదన్న నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేస్తామని జిఓలో పేర్కొన్నారు. నూతన విధానం కోసం లైసెన్స్‌లను ముందుగానే రద్దు చేయడంతో మిగిలిన కాలానికి సంబంధించిన మొత్తాన్ని వెనక్కి ఇస్తామని ప్రభుత్వం తెలిపింది.