- పిడింగొయ్యిలో దళితులపై వివక్ష
- కోరలు చాచిన కులరక్కసి - నిత్యావసరాలు బంద్
- దళితుల ఆటోలనూ బహిష్కరించిన బిసిలు
- పనుల్లేక పస్తులుంటున్న ఎస్సిలు
దళితుల భూమిపై కొందరి పెత్తందారుల కన్నుపడింది. అక్కడ దేవాలయ నిర్మాణానికి పెత్తందారులు చేస్తున్న ప్రయత్నాలను దళితులు అడ్డుకున్నారు. అది జీర్ణించుకోలేని పెత్తందారులు దళితులను వెలి వేశారు. తిండి లేకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నిత్యావసరాలు, పాలు, వైద్యం ఎస్సిలకు దక్కకుండా కట్టడి చేశారు. దళితుల ఆటోలు ఎక్కకూడదని తీర్మానించారు. వారికి చెందిన ఆటోలూ గ్రామాల్లో తిరగకుండా బహిష్కరించారు. కూలి పనులకూ పిలవడం మానేశారు. చివరికి ఉపాధి లేక, తిండిలేక, కుటుంబాలతో పస్తులుంటూ అలమటిస్తున్నారు. ఈ కుల రక్కసి ఘాతుకం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ పిడింగొయ్యిలో కోరలు చాచింది.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం పిడింగొయ్యిలో బిసి సామాజిక తరగతికి చెందిన వారంతా ఏకమై దళితులను వెలివేశారు. ఈనెల 4న జరిగిన ఈ సంఘటన జిల్లాలో సంచలనం కలిగించింది. గ్రామంలో గౌడ, యాదవ సామాజిక తరగతికి చెందినవారు 1,600 కుటుంబాలున్నాయి. 300 దళితుల కుటుంబాలున్నాయి. వీరంతా 40 ఏళ్లుగా కలిసిమెలసి ఉంటున్నారు. 40 ఏళ్ల క్రితం 17 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండేది. ఇందులో శ్మశానానికి మూడెకరాలు కేటాయించారు. 1993లో దళితులకు 5.16 ఎకరాల గుట్ట భూమిని ఫీల్డ్‌మెన్ లేబర్ కో- ఆపరేటివ్ సొసైటీ పేరున ప్రభుత్వం ఇచ్చింది. మిగిలిన భూమి ఆక్రమణకు గురైంది. తొలుత దళితులు ఈ భూమిలో సాగు ప్రయత్నాలు చేశారు. ఫలితం లేకపోవడంతో సీతాఫలం, నిమ్మ, జీడిమామిడి సాగు చేస్తున్నారు. ఫలసాయాన్ని అనుభవిస్తూ కూలి, ఇతర పనులు చేసుకుని జీవిస్తున్నారు. 40 ఏళ్ల క్రితం ఎస్సిలు ఈ భూమిలో కృష్ణుడి ఆలయం నిర్మించుకుని పూజలు, అన్నదానాలు చేస్తూ వచ్చారు. ఎస్సిలు క్రైస్తవమతం వైపు మొగ్గుచూపడంతో పూజలు నిలిపివేశారు. ఆలయం శిథిలమైంది. ఇటీవల ఈ భూమి ధర గజం రూ.10 వేల నుంచి రూ.12 వేలు పలుకుతోంది. ఈనేపథ్యంలో ఈ భూమిపై కన్నేసిన బిసిలు ఆ స్థలంలో శివాలయం నిర్మించేందుకు ఏప్రిల్ 23న భూమి పూజచేశారు. ఆ సమయంలో ఎస్సిలు వారి పనులను అడ్డుకున్నారు. తమకు ప్రభుత్వం ఈ భూమి ఇచ్చిందని పట్టా ఉందని ఎస్సిలు చెప్పారు. ఇరు గ్రూపులూ తహశీల్దార్ సమక్షంలో రెండు దఫాలుగా చర్చలు జరిపారు. ఈనేపథ్యంలోనే తమ భూమిని కాపాడుకునేందుకు ఎస్సిలు ఏప్రిల్‌లో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. అదే సమయంలో ఎస్సి సామాజిక తరగతికి చెందిన యువకుడు, బిసి సామాజిక తరగతికి చెందిన యువతిని ప్రేమించాడు. వారిద్దరూ ఇళ్లు విడిచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బిసిలు ఏకమై అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి, అదే స్థలంలో పడేసి వెళ్లిపోయారని దళితులు బొమ్మూరు పోలీసుస్టేషన్లో కేసు పెట్టారు. తాము కోరుకున్న భూమిలో శివాలయం నిర్మించేందుకు నిరాకరించడం, తమపై పోలీసు కేసుపెట్టడం, తమ సామాజిక తరగతికి చెందిన యువతిని ఎస్సి యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడాన్ని జీర్ణించుకోలేని బిసి సామాజిక తరగతి నాయకులు గ్రామంలో ఎస్సిలను వెలి వేయాలని తీర్మానించుకున్నారు. ఈనెల 10 నుంచి దళితులకు పాలు, నిత్యావసరాలు అందకుండా చేస్తున్నారు. కూలి పనులకు పిలవడంలేదు. దళితుల ఆటోలు ఎక్కకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఈవిషయంపై ఎస్సిలు రాజమండ్రి సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇరుగ్రూపుల వారినీ పిలిపించి రాజీ పడాలని సబ్‌కలెక్టర్ రామరాజు కోరారు. దీనికి దళితులు అంగీకరించలేదు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి, తమను వెలివేసిన వారిపై చర్య తీసుకోవాలని దళితులు డిమాండ్ చేశారు. డిఎస్పి ఆస్మా ఫర్హీన్, రూరల్ తహశీల్దార్ భీమారావు గ్రామంలో పరిస్థితిని సమీక్షించినప్పటికీ ఫలితం శూన్యం. అధికారులు మాత్రం సమస్య పరిష్కారంలో విఫలమయ్యారని కెవిపిఎస్ విమర్శిస్తోంది. ఇదిలా ఉండగా ఆదివారం ఎస్సి సామాజిక తరగతికి చెందిన యువకులు ఎప్పటి మాదిరిగానే ఆటోలు ఎక్కాల్సిందిగా బిసిలను కోరారు. 'మీ ఆటోలు ఎక్కేది లేదు' అంటూ తెగేసి చెప్పి దుర్భాషలాడారని దళితుడు గెడ్డం ప్రసాదరావు తెలిపారు.
ఆటోలు ఎక్కడమే మానేశారు..
బండి యోహాను, ఆటోడ్రైవర్
గ్రామంలో బిసిలు విధించిన వెలి తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటుంది. అత్యవసరాలను దళితులకు దక్కకుండా చేశారు. దళితుల ఆటోలు ఎక్కేందుకు బిసి కుటుంబాలు నిరాకరిస్తు న్నాయి. దళిత మహిళ నిర్వహిస్తున్న అంగన్వాడీ సెంటర్‌కు 20 మంది చిన్నపిల్లలను పంపించేందుకు బిసి కుటుంబాలు నిరాకరించాయి. పాలు, పెరుగు విక్రయాలు, సెలూన్ షాపు, పిఎంపి వైద్యుడు సేవలనూ నిలిపేశారు.
పిల్లలకు పాలూ ఇవ్వడం లేదు : గెడ్డం మాణిక్యం, దళిత మహిళ
వెలి తర్వాత గ్రామంలో తమ పిల్లలకు పాలు సైతం విక్రయించేందుకు బిసిలు నిరాకరిస్తున్నారు. ఎంత బతిమాలినా పాలు ఇవ్వలేదు. షాపుల్లోనూ నిత్యావసర వస్తువులు విక్రయించడం లేదు. జరిమానాల పేరుతో గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇప్పటికీ గ్రామంలో పరిస్థితిలో మార్పు లేదు.
ఎంతకాలం రాజీపడి జీవించాలి : గెడ్డం మోషే, పిడింగొయ్యి దళిత నాయకులు.
గ్రామంలో మెజార్టీ సంఖ్యలో ఉన్న బిసిలు, మైనార్టీబద్ధంగా ఉన్న దళితులపై వివక్షత, పెత్తనం చెలాయిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఇరుగ్రూపుల మధ్య వివాదాలు జరిగినప్పుడల్లా శాంతి కమిటీలతో రాజీ పడేలా ఒత్తిడి తెస్తున్నారు. ఇలా ఎంత కాలం రాజీ పడి జీవించాలి. దీనివల్ల కొత్త వివాదాలు పునరావృతం అవుతున్నాయి. ఈసారైనా దోషులను అరెస్ట్ చేస్తే ఇలాంటివి పునరావృతం కావు. రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని బాధిత దళితుల్లో విశ్వాసం కల్పించాలి.